కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన శశి థరూర్.. రాహుల్ గాంధీకి ఇరకాటం
పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఝలక్ ఇచ్చే శశిథరూర్ తాజాగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చారని అంటున్నారు.
By: Tupaki Political Desk | 21 Jun 2026 9:15 AM ISTసీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ సొంత పార్టీని మరోసారి ఇరకాటంలో పెట్టారు. పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఝలక్ ఇచ్చే శశిథరూర్ తాజాగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించి అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చారని అంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో, ఇరాన్ యుద్ధ ప్రభావం, భారతీయ నావికుల భద్రతపై ప్రధాని మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ట్రంప్‌తో సమావేశంలో జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారని రాహుల్ గాంధీ బృందం ఆరోపించింది. కానీ, సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి ఊహించని షాకిచ్చాయి.
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో నావికుల భద్రత విషయంలో ప్రధాని మోదీ, ట్రంప్‌తో సమావేశం సందర్భంగా తన ఆందోళనను తెలియజేశారని శశిథరూర్ స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో వాణిజ్య నౌకల సిబ్బంది లక్ష్యం కాకూడదని ప్రధాని గుర్తుచేశారని పేర్కొంటూ, మోదీ దౌత్యరీతిని థరూర్ బహిరంగంగానే ప్రశంసించారు. దీంతో కాంగ్రెస్ వ్యూహాలకు గండి పడినట్టయ్యింది. శశిథరూర్ వ్యాఖ్యలు సొంత పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేయగా, అధికార బీజేపీకి అస్త్రంగా మారాయి. శశిథరూర్ వ్యాఖ్యలను వెంటనే అందిపుచ్చుకున్న బీజేపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ ఎదురుదాడి మొదలు పెట్టింది.
శశిథరూర్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ ఏమాత్రం ఆలస్యం చేయకపోవడం విశేషంగా చెబుతున్నారు. "కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలే ప్రధాని మోదీ దౌత్య విధానాన్ని మెచ్చుకుంటుంటే, రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?" అంటూ బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ప్రధాని నిబద్ధతను శశిథరూర్ గుర్తించారని, అదే సమయంలో రాహుల్ గాంధీ మాత్రం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ లో శశిథరూర్ శైలి ఎప్పుడూ భిన్నంగా ఉంటుందని అంటున్నారు. పార్టీ లైన్ దాటి వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో, థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీని ఇరుకున పెట్టి, ప్రత్యర్థికి అవకాశం ఇచ్చే ఇటువంటి 'భిన్న స్వరాలు' కాంగ్రెస్ వ్యూహాలకు అడ్డంకులుగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
