Begin typing your search above and press return to search.

షర్మిల ప్లేస్ లో ఆమెకు పీసీసీ పగ్గాలు ?

ఏపీలో పీసీసీకి కొత్త సారధి వస్తారా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. 2024 జనవరిలో షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఎంపిక చేశారు.

By:  Satya P   |   2 Aug 2025 4:00 AM IST
షర్మిల ప్లేస్ లో ఆమెకు పీసీసీ పగ్గాలు ?
X

ఏపీలో పీసీసీకి కొత్త సారధి వస్తారా అంటే ప్రచారం మాత్రం అలాగే ఉంది. 2024 జనవరిలో షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా ఎంపిక చేశారు. ఆమె 2021లో తెలంగాణాలో వైఎస్సార్ టీపీని స్థాపించారు. ఆమె తన పార్టీని 2023 చివరిలో కాంగ్రెస్ లో విలీనం చేశారు. దానికి ఫలితంగా ఆమెకు ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆమె వల్ల కాంగ్రెస్ కి ఏ మాత్రం లాభం కలగలేదు కానీ టీడీపీకి భారీగా రాజకీయ లబ్ది చేకూరింది. చెల్లెమ్మ సెంటిమెంట్ పండి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ ఓటు బ్యాంకు కొట్టుకుని పోయింది. ఆ మేరకు టీడీపీ కూటమి గణనీయంగా లాభపడింది.

ఏ మాత్రం ఎత్తిగిల్లని పార్టీ :

ఇక 2024 జూన్ లో ఫలితాలు వచ్చిన తరువాత ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పదిహేను నెలలుగా ఏపీలో పాలన సాగిస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల ఎంచుకున్న రాజకీయ వ్యూహం కరెక్ట్ గా ఉంది. అధికార పార్టీని ఆమె విమర్శిస్తూ కాంగ్రెస్ ఆశలను హైప్ కి పెంచారు. కానీ వైసీపీ ఓటమి తరువాత కూడా ఆ పార్టీనే టార్గెట్ చేయడంతో ఆ పార్టీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదు. పైగా మరింతగా ఇబ్బందుల్లో పడింది.

సీనియర్లంతా సైలెంట్ :

కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా చేసిన వారు అనేక మంది ఉన్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ మీద మమకారంతో ఇంకా కొనసాగుతున్నారు. వారిని కలుపుకుంటూ కాంగ్రెస్ అజెందాని జనంలో ఉంచాల్సిన షర్మిల ఆ విషయంలో వెనుకబడ్డారు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఏపీలో కూడా అదే తీరున ఎన్డీయే ప్రభుత్వం మీద దూకుడుగా పోరాటం చేయాల్సి ఉండగా షర్మిల ఎందులో సరైన వ్యూహాలను ఎంచుకోలేకపోతున్నారు. దాంతో సీనియర్లు సైలెంట్ అయ్యారు.

కొంతకాలంగా అదే చర్చ :

కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా పీసీసీ చీఫ్ మార్పు అన్న దాని మీదనే చర్చ సాగుతోంది షర్మిల ఎంతకాలం కొనసాగితే అంతకాలం కాంగ్రెస్ కి ఇబ్బందే అని పార్టీ నేతలు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీలో పార్టీ విషయంలో సీరియస్ గానే అలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా వారు షర్మిల ప్లేస్ లో కేంద్ర మాజీ మంత్రి బీసీ నేత అయిన కిల్లి కృపారాణీని ఎంపిక చేస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.

ధీటైన మహిళా నేతగా :

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కిల్లి కృపారాణి వైద్యురాలిగా సుప్రసిద్ధురాలు. సేవా కార్యక్రమాలను కూడా ఆమె జిల్లాలో నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిలో పడ్డారు వైఎస్సార్ 2003లో పాదయాత్ర చేస్తున్నపుడు ఆమె పార్టీలో చేరారు. అలా వైఎస్సార్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయంగా ఎదిగారు 2004లో ఆమె తొలిసారిగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు మీద ఓటమి చెందారు అయితే 2009లో ఆమె అదే ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

సమర్ధవంతురాలుగా పేరు:

ఉన్నత విద్యావంతురాలిగా బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన మహిళగా జిల్లాలో ఉన్న ఆమె ప్రతిభను మెచ్చి యూపీయే టూ ప్రభుత్వంలో ఆమెకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పదవిని ఇచ్చారు. ఇక 2014లో సైతం ఆమె ఇతర పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల ముందు మాత్రం వైసీపీలో చేరారు. అయితే అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో ఆమెకి ఏ విధమైన పదవులూ దక్కలేదు.

దాంతో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో ఆమె టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. రాహుల్ గాంధీతో నేరుగా పరిచయం ఉన్న వారు కావడంతో పాటు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నేర్పు క్యాడర్ కి దగ్గరగా ఉండే ఓర్పు అన్నీ ఆమెకు ఉన్నాయని భావిస్తున్న హై కమాండ్ ఆమెకు పీసీసీ పట్టం కట్టబెడతారు అని ప్రచారం అయితే సాగుతోంది. అదే కనుక జరిగితే షర్మిల మాజీ అవుతారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సిందే.