భారత్ లో బంగ్లాదేశ్ నటి వద్ద 2 ఆధార్ కార్డులు.. ఎవరీమె?
ఈ సమయంలో ఆమె దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
By: Raja Ch | 1 Aug 2025 11:45 AM ISTపహల్గాం దాడి తర్వాత భారత్ పలు దౌత్య పరమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. దీంతో... దేశం విడిచి వెళ్తున్న ఓ పాకిస్తానీ వ్యక్తి.. తాను గత 17 ఏళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటున్నానని.. ఇక్కడ తనకు రేషన్ కార్డు ఉందని, ఎన్నికల్లో తాను ఓటు కూడా వేశానని చెప్పిన వీడియో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో రెండు ఆధార్ కార్డులు కలిగి ఉంది ఓ బంగ్లాదేశ్ నటి.
అవును... అనధికారికంగా భారత్ లోకి ప్రవేశించినవారు.. టైమ్ దాటిపోయినా అక్రమంగా భారత్ లోనే ఉండిపోయినవారు.. ఇటీవల కాలంలో భారతదేశం భారతీయులకు మాత్రమే ఇచ్చే గుర్తింపుకార్డులను కలిగి ఉంటున్నారనే కథనాలొస్తున్నాయి! ఈ క్రమంలో తాజాగా... ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు వంటి భారతీయ గుర్తింపు పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలతో.. నటి, మోడల్ అని చెబుతున్న 28 ఏళ్ల బంగ్లాదేశ్ మహిళ శాంతా పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సమయంలో ఆమె దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె వద్ద నుంచి పలు బంగ్లాదేశ్ పాస్ పోర్టులు, రీజెంట్ ఎయిర్ వేస్ (బంగ్లాదేశ్) ఎంప్లాయి ఐడీ కార్డు, ఢాకాలోని సెకండరీ విద్యకు సంబంధించిన అడ్మిట్ కార్డు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో... భారత్ లో ఆధార్, రేషన్, ఓటర్.. ఈమెకు ఇవన్నీ ఆమెకు ఎలా వచ్చాయని అధికారులు షాక్ అయ్యారని తెలుస్తోంది.
ప్రస్తుతం... కోల్ కతాలోని జాదవ్ పూర్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటోన్న ఈమె.. చెల్లుబాటు అయ్యే వీసా లేకుండానే భారత్ లో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఆమె 2023 నుంచీ అదే ప్రాంతంలో అద్దెకు ఉంటోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్క్ స్ట్రీట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు ఆగస్టు 8 వరకు కస్టడీకి అప్పగించింది. దీంతో... ఈ కార్డులన్నీ ఎలా వచ్చాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు!
కాగా... 2019లో పాల్ కేరళలో జరిగిన మిస్ ఆసియా గ్లోబల్ పోటీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉత్తర బెంగాల్ లో గతంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో.. బెంగాలీ, తెలుగు చిత్రాలలో పనిచేస్తున్నట్లు చెప్పిందని అంటున్నారు! దీంతో... ఈమె తెలుగులో ఏమి సినిమాలు చేసింది? అసలు నిజంగా తెలుగు సినిమాల్లో నటించిందా? అనే సెర్చ్ మొదలైందని అంటున్నారు!
