నయనతార ప్రస్తావనతో చిక్కుల్లో చిక్కుకున్న అన్నాడీఎంకే ఎంపీ
బాధ్యతగా మాట్లాడాల్సిన రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులు అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతుంటారు.
By: Garuda Media | 18 March 2026 9:26 AM ISTబాధ్యతగా మాట్లాడాల్సిన రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులు అడ్డదిడ్డంగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతుంటారు. తమ వ్యాఖ్యలతో లేనిపోని తిప్పలు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి సమస్యను కొనితెచ్చుకున్నారు అన్నాడీఎంకే ఎంపీ ఒకరు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించటంతో పాటు.. ఆయన ఇచ్చిన హామీని చీల్చిచెండాడే అక్రమంలో తనకు తానే అడ్డంగా బుక్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటం.. తీవ్రస్తాయిలో విరుచుకుపడటం మామూలే. ఇలాంటి సందర్భాల్లో సంబంధం లేని మూడో వ్యక్తి ప్రస్తావన ఏ మాత్రం సరికాదు. ఒకవేళ తప్పదనుకుంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు ఏ మాత్రం మంచిదికాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.
ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘మీ కలల్ని మాకు చెప్పండి. వాటిని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని హామీ ఇచ్చారు. సీఎం హామీకి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించిన షణ్ముగం.. సంబంధం లేని సినీ తార నయనతార ప్రస్తావన తెచ్చి.. వివాదంలో చిక్కుకున్నారు. ‘‘కలల కనమని అబ్దుల్ కలాం మనకు చెప్పారు. మన కలలను తనతో పంచుకోవాలిన స్టాలిన్ అడుగుతున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా?’’ అంటూ సంబంధం లేని పోలికను తీసుకొచ్చి.. అడ్డంగా బుక్ అయ్యారు.
ఈ దరిద్రపుగొట్టు వ్యాఖ్యల్ని ఆయన మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడటం గమనార్హం. చెన్నైలోని విల్లుపురంలో ఎన్డీయే ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. షణ్ముగం వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ స్పందించింది. షణ్ముగాన్ని మరింత ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. తమ విధానాల్ని విమర్శించాలని.. అంతేతప్ప మహిళల గురించి అనుచితంగా మాట్లాడొద్దని పేరకొన్నారు.
‘‘నయనతారను అవమానించటం ద్వారా మహిళలందరినీ మీరు అవమానిస్తున్నారు.ఈ తరహా వ్యాఖ్యలు ఏ మాతరం ఆమోదయోగ్యమైనవి కావు’ అంటూ డీఎంకే మండిపడింది. ఈ విమర్శల పర్వం అక్కడితో ఆగలేదు. నయనతార మీద చేసిన వ్యాఖ్యలను నడిగర సంఘం ఖండించింది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యల్ని చేయటాన్ని తప్పు పట్టింది. బాధ్యతగల పదవుల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తూ.. నయనతారకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
