పాకిస్తాన్‌లో లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వరుస హత్యలు.. కారణం ఇదేనా?
పాకిస్తాన్‌లో మరో లేడీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్యకు గురయ్యింది.
By: Ramesh Palla | 20 Aug 2026 12:16 PM ISTపాకిస్తాన్‌లో మరో లేడీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్యకు గురయ్యింది. టిక్‌టాక్‌లో దాదాపుగా 13 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆయేషా గిలమానా అలియాస్ షంసో బీబీని ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్చి చంపి అదే బైక్ పై పరారు కావడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇస్లామాబాద్‌కి సమీపంలో ఉండే తక్సిలా ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుందని పాకిస్తాన్‌కు చెందిన మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. టిక్‌టాక్‌లో షంసో బీబీ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తక్కువ సమయంలోనే ఈమెను పాకిస్తాన్ జనాలు అభిమానించడం మొదలైంది. ఆమెకు దక్కిన అభిమానం కారణంగా హత్యకు గురై ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పాక్తిస్థాన్‌లో ఎక్కువ శాతం ముస్లీంలు తమ ఆడవారి ముఖం బయటకు కనిపించకూడదనే కోరుకుంటారు. కానీ షంసో బీబీ మాత్రం ముఖం చూపిస్తూ టిక్‌టాక్ వీడియోలు చేయడం వల్లే హత్య చేసి ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
టిక్‌టాక్ స్టార్ షంసో బీబీ హత్య...
28 ఏళ్ల షంసో బీబీ టిక్‌టాక్‌లో తనకు వచ్చిన ఫేమ్‌తో కొన్ని కమర్షియల్ యాడ్స్‌లోనూ నటించిందని, అందుకు సంబంధించిన ఆర్థిక పరమైన వివాదాల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చు అంటూ షంషో తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న షంసో ను చాలా మంది బెదిరిస్తూ ఉండేవారని, అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ, మతాన్ని కించపరుస్తున్నావు అంటూ విమర్శలు చేసేవారని తండ్రి పోలీసుల విచారణలో చెప్పినట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్థిక వివాదాల కారణంగా హత్య జరిగి ఉండవచ్చు అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ, ఆమె టిక్ టాక్‌లో అసభ్యకర వీడియోలు చేస్తుంది అంటూ కొందరు మతం పిచ్చిలో హత్య చేసి ఉండవచ్చు అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ....
షంసో బీబీ కంటే ముందు నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో లేడీస్ యాక్టివ్‌గా ఉండటాన్ని కొందరు సహించలేక పోతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం సైతం టిక్‌టాక్ తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్ల అసంతృప్తితో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని బ్యాన్ చేయలేక పోయింది. అమ్మాయిలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడంను మొదటి నుంచి కూడా మత పెద్దలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందుకే ఆమతం పిచ్చిలోనే ఇలా లేడీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ను హత్య చేసి ఉంటారేమో అనే అనుమానాలకు బలం చేకూరుతూ ఉంది. కారణం ఏమైనా అయ్యి ఉండవచ్చు కానీ లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వరుసగా హత్యలకు గురి కావడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఇంకా ఎంత మంది లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చనిపోతారో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
పాకిస్తాన్ ప్రభుత్వ స్పందన..
ఇప్పటికే పలువురు లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ద్వారా తమ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, జాగ్రత్తలు పాటిస్తున్నారు. షంసో బీబీని దుండగులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెంబడించి మరీ దగ్గర నుంచి కాల్పులు జరపడం జరిగింది. అందుకే ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్స్ సైతం జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లుగా పాకిస్తాన్ జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. వరుసగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ హత్య గావించబడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు సైతం ఈ విషయమై స్పందించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పాక్ ప్రభుత్వంపై ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేయలేదు. మొదటగా షంసో బీబీ ని హత్య చేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పాక్ పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యలు ముందు ముందు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.
