భారత భూభాగంగంలో చైనా.. మళ్లీ చిచ్చు మొదలైంది..
శాక్స్గామ్ వ్యాలీపైన భారత్, చైనా మధ్య వివాదం రగులుతూనే ఉంది. భారత్ తమదంటే.. చైనా తమదని వాదిస్తోంది.
By: A.N.Kumar | 13 Jan 2026 8:00 PM ISTశాక్స్గామ్ వ్యాలీపైన భారత్, చైనా మధ్య వివాదం రగులుతూనే ఉంది. భారత్ తమదంటే.. చైనా తమదని వాదిస్తోంది. రెండు దేశాల మధ్య శాక్స్గామ్ వ్యాలీ వివాదానికి కారణమైంది. శాక్స్గామ్ వ్యాలీలో నిర్మాణలపై భారత్ అభ్యతరం చెబుతుంటే.. చైనా మాత్రం తన దేశంలో అభివృద్ధి చేయడం తప్పు కాదని వాదిస్తోంది. కానీ భారత్ మాత్రం శాక్స్గామ్ చైనాదే అన్న వాదనను ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. అది జమ్మూకశ్మీర్ లో భాగమని, జమ్మూకశ్మీర్ భారత్ లో భాగమని స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్ - భారత్ మధ్య 1947-48లో జరిగిన యుద్ధంలో శాక్స్గామ్ వ్యాలీ ఆక్రమించుకుని, చైనాకు అప్పగించిందని భారత్ వాదిస్తోంది. చైనా మాత్రం 1960లో చైనా-పాకిస్థాన్ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందాన్ని ప్రస్తావిస్తోంది.
భారత్ అభ్యంతరం..
శాక్స్గామ్ వ్యాలీలో చైనా నిర్మాణాలు చేపట్టింది. దీనిని భారత్ వ్యతిరేకిస్తోంది. తమ దేశ భూభాగంలో చైనా నిర్మాణాలు చేపడుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ చైనా మాత్రం ఆ భూభాగం తమదే అంటోంది. శాక్స్గామ్ వ్యాలీ కారాకోరం పర్వతశ్రేణికి ఉత్తరంలో ఉంటుంది. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న గిల్గిత్ బల్టిస్థాన్ కు పక్కన, సియాచిన్ కు దగ్గరలో ఉంటుంది. భారత సరిహద్దుకు కిలోమీటర్ల దూరంలో చైనా నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ఇది జాతీయ భద్రతకు సవాల్ గా మారుతుంది. ఆ ప్రాంతంలో చైనా ఇప్పటికే 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మించినట్టు తెలుస్తోంది. అందుకే భారత్ అభ్యంతరం చెబుతోంది.
చైనా వాదన..
1963లో చైనా-పాకిస్థాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం.. శాక్స్గామ్ వ్యాలీని పాకిస్థాన్ చైనాకు అప్పగించింది. దీని ప్రకారం చైనా తమదే అంటోంది. అందుకే నిర్మాణాలు చేపడుతున్నట్టు చెబుతోంది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తోంది. పెట్టుబడులు పెడుతోంది. కానీ ఈ ఒప్పందాన్ని భారత్ అంగీకరించడంలేదు. పాకిస్థానే శాక్స్గామ్ ఆక్రమించిందని, ఆ వ్యాలీ జమ్మూకశ్మీర్ భాగమని వాదిస్తోంది. పాకిస్థాన్-చైనా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.
పాకిస్థాన్ వ్యూహమా ?
1963లో చైనా-పాకిస్థాన్ ఒప్పందం వ్యూహమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నిస్తే.. జమ్మూకశ్మీర్ రాజు భారత్ లో కలవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే పాకిస్థాన్ శాక్స్గామ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. భారత్ తో తలపడటం సాధ్యంకాని నేపథ్యంలో వ్యూహాత్మకంగా చైనాకు ఆ ప్రాంతాన్ని అప్పగించి, చైనా మద్దతు తమకు ఉండేలా.. భారత్ తో సరిహద్దు వివాదం కొనసాగేలా చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
