ఢిల్లీ పేలుడు దర్యాప్తులో J&K 'లేడీ సింగం'… ఎవరీ షహీదా పర్వీన్?
ఢిల్లీ పేలుడు దర్యాప్తులో షహీదా పర్వీన్ సేవలు అత్యంత కీలకంగా మారడానికి ఆమెకున్న రెండు ప్రధాన నైపుణ్యాలు దోహదపడుతున్నాయి.
By: A.N.Kumar | 14 Nov 2025 5:00 AM ISTఢిల్లీలోని ఎర్రకోట పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సహకరించడానికి జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి షహీదా పర్వీన్ గంగూలీ రంగంలోకి దిగారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లలో ఆమె చూపిన అసాధారణ ధైర్యం, వ్యూహాత్మక సామర్థ్యం కారణంగా ఆమెకు "లేడీ సింగం" గా పేరు వచ్చింది.
ఎవరు ఈ షహీదా పర్వీన్?
షహీదా పర్వీన్ జమ్మూ ప్రాంతంలోని పూంఛ్ జిల్లాకు చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆమె జమ్మూకాశ్మీర్ నుండి తొలి మహిళా IPS అధికారిణిగా చరిత్ర సృష్టించారు. 1997లోనే యూపీఎస్.సీ పరీక్షను క్లియర్ చేసి, కఠినమైన జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మహిళగా పోలీస్ ఫోర్స్‌లో తనదైన ముద్ర వేశారు. ఆమె పర్వతాల మధ్య పుట్టిన పోరాట యోధురాలిగా ప్రసిద్ధి చెందారు. కౌంటర్-ఇన్సర్జెన్సీ తీవ్రవాద వ్యతిరేక , ఇంటెలిజెన్స్ ఆపరేషన్లలో ఆమెకు అపారమైన అనుభవం ఉంది. ఇప్పటివరకు 300కు పైగా కీలకమైన ఎన్‌కౌంటర్లు, దాడులు .. ఆపరేషన్లకు ఆమె నాయకత్వం వహించినట్లు సమాచారం. ఉగ్రవాదులను అణచివేయడం, కీలక కుట్రలను ఛేదించడం, నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఢిల్లీ దర్యాప్తులో ఆమె పాత్ర ఎందుకు కీలకం?
ఢిల్లీ పేలుడు దర్యాప్తులో షహీదా పర్వీన్ సేవలు అత్యంత కీలకంగా మారడానికి ఆమెకున్న రెండు ప్రధాన నైపుణ్యాలు దోహదపడుతున్నాయి. ఫోరెన్సిక్ విశ్లేషణ, ఉగ్రవాద మాడ్యూల్స్‌పై పట్టు. పేలుడు పదార్థాల స్వభావం, వాటి నిర్మాణం, ఉగ్రవాదులు ఉపయోగించే ప్యాటర్న్స్‌పై ఆమెకు లోతైన అవగాహన ఉంది. ఇది పేలుడు జరిగిన ప్రాంతంలోని ఆధారాలను, బాంబు తయారీ తీరును వేగంగా కచ్చితంగా విశ్లేషించడానికి సహాయపడుతుంది.
కాశ్మీర్ ప్రాంతంలో ఆమె అందించిన సుదీర్ఘ సేవ, స్థానిక ఉగ్రవాద మాడ్యూల్స్, రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్‌లు ఫండింగ్ ఛానెల్స్‌పై ఆమెకు విస్తృతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈ అనుభవం ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న జాతీయ లేదా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లను ఛేదించడంలో కీలకం కానుంది. పేలుడుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, ప్లానింగ్ మెకానిజం, మరియు లాజిస్టిక్స్‌ను అర్థం చేసుకోవడంలో ఆమె ఇన్‌పుట్స్ దర్యాప్తుకు సరైన దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
నిపుణుల అంచనా ప్రకారం, షహీదా పర్వీన్ దర్యాప్తులో చేరడం వల్ల ఫోరెన్సిక్ ఆధారాలు వేగంగా విశ్లేషించబడతాయి, తద్వారా టెర్రర్ మాడ్యూల్స్‌పై మరింత ఖచ్చితమైన అంచనాలు వేయడానికి వీలవుతుంది. ఈ నైపుణ్య ఆధారిత దిశానిర్దేశంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
ఐరన్ లేడీ
సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చి, దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒక మహిళా ఐపీఎస్ అధికారిగా నిలదొక్కుకోవడం, 300కి పైగా ఆపరేషన్లకు నాయకత్వం వహించడం అనేది షహీదా పర్వీన్ యొక్క శక్తి, పట్టుదల, కఠోర సాధనకు నిదర్శనం. ఆమె సాహసాలు, సేవలు, దర్యాప్తు నైపుణ్యాలు భారతదేశంలో కొత్త తరానికి నిజమైన ప్రేరణగా నిలుస్తున్నాయి.
