పాక్ ప్రధాని వేచి వేసారి...తలెక్కడ పెట్టుకుంటారో ?
విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి అంతర్జాతీయ వేదిక మీద ఘోరాతి ఘోరమైన పరాభవం జరిగింది తుర్కుమెనిస్తాన్ లో జరిగిన ఫోరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By: Satya P | 12 Dec 2025 11:00 PM ISTమాట్లాడితే చాలు భారత్ మీద నోటికి వచ్చినట్లుగా విరుచుకుపడతారు. లేస్తే మనిషిని కాను అన్నట్లుగా దాయాది పాక్ తీరు ఉంటుంది. భౌగోళిక పరంగా చూసినా లేక ఆర్ధికంగా అంతర్జాతీయంగా ఇతరత్రా ఏ పోలిక చూసుకున్నా అసలు భారత్ తో ఏమైనా కంపేరిజన్ ఉందా పాక్ అంటే జవాబు వారికి ఎన్నో సార్లు చేదుగానే వచ్చింది. అయినా పాక్ కి ఏ మాత్రం తెలిసి రాకపోవడమే చిత్రం. తాజాగా మరో ఘోర పరాభవం మూటగట్టుకుంది దాయాది పాక్. ఆ దేశ ప్రధానికి అంతర్జాతీయ వేదిక మీద తీరని అవమానం జరిగింది. ఒక విధంగా పాక్ ప్లేస్ ఏంటి ప్రపంచ వేదికల మీద పాక్ ఎక్కడ ఉందని చెప్పే సన్నివేశంగా దీనిని అంతర్జాతీయ దౌత్య నిపుణులు చూస్తున్నారు.
ఘోర పరాభవంగా :
విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి అంతర్జాతీయ వేదిక మీద ఘోరాతి ఘోరమైన పరాభవం జరిగింది తుర్కుమెనిస్తాన్ లో జరిగిన ఫోరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో సమావేశం కోసం పాక్ ప్రధాని హెహబాజ్ షరీఫ్ ఏకంగా నలభై నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అలా వేచి చూసి వేసారిన షెహబాజ్ షరీఫ్ ఫోటోలు వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇంతసేపూ వేచి చూసినా కూడా రష్యా అధినేత అయితే ఆ సమయంలో బయటకు రాలేదు.
ఓపిక నశించినా :
మరీ ఇంతలా తనను వేచి ఉండేలా చేసిన రష్యా అధినేత విషయంలో ఒకింత అసహనంతో షెహబాజ్ షరీఫ్ అయితే పుతిన్ వేరే మీటింగులో ఉండగా ఆ సమావేశం గది వద్దకు నేరుగా వెళ్ళారు. అయినా సరే ఏమి జరిగిందో తెలియదు కానీ కొద్ది సేపటిలోనే షెహబాజ్ షరీఫ్ ఒక్కరే బయటకు రావాల్సి వచ్చింది. అంటే సుదీర్ఘంగా వెయిట్ చేసినా ఆ మీదట తాను ఒకరిని బయట ఉన్నాను అని చెప్పడానికి నేరుగా పుతిన్ మీటింగ్ లోకి చొరపడినా కూడా ఫలితం అయితే లేకపోయింది అన్న మాట. ఇంతలా అసహనం చెందినా పాక్ ప్రధాని విషయంలో పుతిన్ ఏ మాత్రం పట్టించుకోలేదు అంటే అది పాక్ కి తీరని అవమానమే కదా అని అంటున్నారు.
ట్రోలింగ్ అవుతూ :
ఇదిలా ఉంటే షెహబాజ్ షరీఫ్ ఈ రకమైన అవమానం పొందిన వైనం అంతా సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కి గురి అవుతోంది. పాకిస్థాన్ పరువు ఇదీ అని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గొప్పలు చెప్పుకోవడం కాదు బయటకు వస్తే దక్కే మర్యాద కూడా ఇదే అని అంటున్నారు. ఊరకే భారత్ మీద పడి ఏడవడం కాదు, పాక్ ముందు తనను తాను తీర్చి దిద్దుకోవాలని ఒక దేశంగా కనిపించాలని కూడా సూచిస్తున్నారు. ఒకరి మీద అసూయ ద్వేషాలు పెంచుకుంటే తాము కృశించిపోవడం తప్ప మరేమీ ఉండదని పాక్ ని దాని బాధని చూస్తూ నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి పాక్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో అని కూడా కామెంట్స్ పడుతున్నాయి.
