మోదీ తర్వాతే ఎవరైనా..అమెరికా కీలక వ్యాఖ్యలు
అమెరికా భారత్ పై టారిఫ్ లు విధించి, మరోవైపు వాణిజ్య చర్చలు జరుపుతున్న సందర్భంలో.. కొత్తగా భారత్ కు అమెరికా రాయబారిగా ఎంపికైన సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 12 Jan 2026 7:00 PM ISTఅమెరికా భారత్ పై టారిఫ్ లు విధించి, మరోవైపు వాణిజ్య చర్చలు జరుపుతున్న సందర్భంలో.. కొత్తగా భారత్ కు అమెరికా రాయబారిగా ఎంపికైన సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాలను మరోస్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. ప్రపంచంలో జనాభాలో భారత్ అతిపెద్ద దేశమని, రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం కీలకమని సెర్గియో గోర్ అన్నారు. వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఇరుదేశాల ప్రతినిధులు నిరంతరం చర్చలు జరుపుతున్నారని తెలిపారు. భద్రత, ఆరోగ్యం, ఇంధనం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఇరుదేశాల పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాణిజ్యం చర్చలకు జనవరి 13న మరోసారి ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్టు తెలిపారు. తమకు భారత్ తర్వాతే ఎవరైనా అంటూ సెర్గీయో గోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియాకు ట్రంప్
అదే సందర్భంలో నిజమైన స్నేహితుల మధ్య విబేధాలు సహజమే. వారు వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగేందుకే ప్రయత్నిస్తారని ట్రంప్, మోదీ స్నేహాన్ని ఉద్దేశిస్తూ సెర్గీయో గోర్ వ్యాఖ్యానించారు. ఏడాదిలో లేదా రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ వస్తారని తెలిపారు. అదేసమయంలో సిలికాన్ సరఫరా కోసం అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన ప్యాక్స్ సిలికా కూటమిలోకి ఇండియాను ఆహ్వానిస్తున్నట్టు సెర్గియో గోర్ ప్రకటించారు.
నోటితో నవ్వి నొసటితో వెక్కరించడమే
అమెరికా తీరు నోటితో నవ్వి నొసటితో వెక్కరించినట్టు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు టారిఫ్ లు విధిస్తున్నారు. వాటిని 500 శాతం వరకు తీసుకువెళ్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్ తర్వాతే అమెరికాకు ఎవరైనా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకమైన వ్యవహారం అమెరికా తీరును ప్రతిబింబిస్తోంది. మిగిలిన దేశాలతో డీల్ చేసినట్టుగా కాకుండా కొంత పట్టువిడుపు ప్రదర్శించడానికి.. భారత్ వల్ల అమెరికాకు లబ్ధి చేకూర్చే అంశాలే అన్నది నిపుణుల వాదన. ఎందుకంటే జనాభా అధికంగా ఉన్న మనదేశం అమెరికాకు పెద్ద మార్కెట్. అమెరికన్ ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకోవడానికి మన దేశంతో సంబంధాలు కీలకం. అందుకే ఒకవైపు బెదిరిస్తున్నట్టు మరోవైపు భారత్ ముఖ్యం అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే భారత్, అమెరికా మధ్య వాణిజ్యం ఒప్పందంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ స్పష్టత మాత్రం రావడంలేదు. చర్చలకు ముగింపు దొరకడంలేదు. ఇంకా ఎన్నిరోజులు చర్చ జరుగుతుందోనన్న వాదన ఉంది.
