వెయిటింగ్ లిస్టులో నేతలు.. ఫ్యూచరేంటి.. ?
ఇక, ఇప్పటికే పార్టీలు మారిన వారు.. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా.. ఆయా నియోజకవర్గాల్లో వారి సందడి ప్రత్యేకంగా కనిపించడం లేదు.
By: Garuda Media | 14 Jan 2026 10:38 AM ISTచాలా మంది సీనియర్ నాయకులు ప్రస్తుతం వెయిటింగ్ జాబితాలో ఉన్నారు. అంటే.. ఏదో ఒక పార్టీలో ఉన్నవారు కాదు.. ఏ పార్టీలోనూ లేని నాయకులు.. కొన్ని పార్టీల్లో ఉన్నామంటే ఉన్నామని చెబుతున్న వారు.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గత 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన చాలా మంది నాయకులు వైసీపీకి దూరంగా ఉన్నారు. కొందరు పార్టీ మారారు. అయితే.. ఇంకొందరు పార్టీ లో ఉన్నా.. మౌనంగా ఉంటున్నారు.
ఇక, అదే ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ తరఫున ఇతర చిన్నా చితకా పార్టీల తరఫున పోటీ చేసి పరాజయం పాలై న బలమైన నాయకులు కూడా మౌనంగా ఉంటున్నారు. అయితే.. వారికి సదరు పార్టీల్లో ఉండడం ఇష్టం లేదు. అలాగని.. ఇతర పార్టీల్లోకి చేరుదామంటే.. అవకాశం వస్తుందా? రాదా? అనే మీమాంస వారిలో కొన సాగుతోంది. దీంతో ఎటూ కాకుండా.. అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా.. పార్టీలు మారినా.. తమ ప్రభావం తగ్గకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక, ఇప్పటికే పార్టీలు మారిన వారు.. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా.. ఆయా నియోజకవర్గాల్లో వారి సందడి ప్రత్యేకంగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ తమ నియోజకవర్గాల్లో అన్నీ తామై చక్రం తిప్పిన నాయ కులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ఇక, ఆశించిన పదవులు, గౌరవాలు కూడా తొలినాళ్లలో అందిన ట్టుగా ఇప్పుడు అందడం లేదు. ఈ పరిణామాలతో.. కొత్తగా పార్టీలు మారాలని ప్రయత్నిస్తున్న నాయకులు సైలెంట్ అవుతున్నారు. అయితే.. వారు కొన్నాళ్లకైనా మారడం ఖాయం.
ఇక, వైసీపీలో పరిస్థితి అందరికీ తెలిసిందే. రోజు రోజుకు ఆ పార్టీ మరింతగా గ్రాఫ్‌ను తగ్గించుకునేందుకు పోటీ పడుతోంది. తద్వారా.. కొత్తగా చేరడం దేవుడెరుగు.. ఉన్నవారే బయటకు వచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీలో చేరుదామా? అంటే.. ఇప్పటికే గత ఎన్నికల్లో చేరిన వారు.. బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో.. మొత్తంగా ఒక రాజకీయ శూన్యత అయితే కనిపిస్తోంది. దీంతో ఔత్సాహిక నాయకులు.. చాలా మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా.. వెంటనే అందిపుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
