Begin typing your search above and press return to search.

'సీనియ‌ర్ సిటిజ‌న్ కార్డ్‌' తో ఎన్నో లాభాలు.. అస్స‌లు మిస్ అవ్వొద్దు!

భారతదేశంలో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు.

By:  Sivaji Kontham   |   2 Oct 2026 4:00 AM IST
సీనియ‌ర్ సిటిజ‌న్ కార్డ్‌ తో ఎన్నో లాభాలు.. అస్స‌లు మిస్ అవ్వొద్దు!
X

భారతదేశంలో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. వారి జీవితాన్ని సులభతరం చేయడానికి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలాంటి అంతరాయం లేకుండా పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కొన్ని గుర్తింపు కార్డులను అందజేస్తున్నాయి. ఆధార్ కార్డ్, ఇతర ధ్రువీకరణ పత్రాలతో పాటు ఈ ప్రత్యేక కార్డులు (సీనియ‌ర్ సిటిజ‌న్ కార్డ్) వృద్ధులకు సమాజంలో ఒక బలమైన అధికారిక గుర్తింపును ఇస్తాయి. ముఖ్యంగా వయసురీత్యా రావాల్సిన హక్కులను, రాయితీలను సులభంగా క్లెయిమ్ చేసుకోవడానికి ఈ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి.

రైళ్ల‌లో బెర్త్ లు, ఆస్ప‌త్రుల్లో డిస్కౌంట్లు:

సీనియర్ సిటిజన్ల కోసం జారీ చేసే అధికారిక కార్డు కలిగి ఉండటం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటప్పుడు టికెట్ ధరలపై రాయితీలు లభించడంతో పాటు... బస్సుల్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందవచ్చు. అలాగే రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రత్యేక బెర్త్‌ల కేటాయింపులో ప్రాధాన్యత లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో డిస్కౌంట్లు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలలో ప్రత్యేక టోకెన్లు లేదా ఫీజుల్లో మినహాయింపులు వంటి ఎన్నో సౌకర్యాలు ఈ కార్డు ద్వారా అందుబాటులోకి వస్తాయి.

ఆర్థిక - బ్యాంకింగ్ రంగాల్లో ప్రత్యేక రాయితీలు

వృద్ధుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు-ఆర్థిక సంస్థలు ప్రత్యేక పథకాలను ప్రకటిస్తాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్.సి.ఎస్.ఎస్) స‌హా ర‌క‌ర‌కాల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరుల కంటే అదనపు వడ్డీ రేట్లు లభిస్తాయి. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం నిర్దిష్ట పరిమితి వరకు పన్ను మినహాయింపులు, వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. బ్యాంకింగ్ సేవల్లో క్యూ లైన్లలో నిలబడకుండా ప్రత్యేక కౌంటర్లు లేదా ప్రాధాన్యత సేవలను పొందడానికి ఈ గుర్తింపు కార్డులు ఎంతగానో సహకరిస్తాయి.

కార్డు దరఖాస్తు ప్రక్రియ - కావాల్సిన పత్రాలు

ఈ సీనియర్ సిటిజన్ కార్డును పొందడం కోసం అర్హులైన వారు సులభమైన ప్రక్రియను అనుసరించవచ్చు. 60 ఏళ్లు నిండిన పురుషులు 58 ఏళ్లు దాటిన మహిళలు దీనికి అర్హులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామ/వార్డు సచివాలయాలు లేదా సంబంధిత జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు వయసును నిర్ధారించే ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు .. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కార్డు జారీ అయితే దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.

చట్టపరమైన రక్షణ - ప్రత్యేక ప్రాధాన్యత

సాధారణ జీవితంలోనే కాకుండా అత్యవసర సమయాల్లోనూ ఈ కార్డులు వృద్ధులకు రక్షణ కవచంలా నిలుస్తాయి. ఒకవేళ న్యాయపరమైన వివాదాలు లేదా కేసులు ఏవైనా ఉంటే... కోర్టు విచారణల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ త్వరతగతిన విచారణ జరిగేలా చూడటానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారు లేదా ఆదరణ లేని వృద్ధులు ప్రభుత్వ- ప్రైవేట్ ఆశ్రమాల్లో ఆశ్రయం పొందేందుకు ఈ గుర్తింపు పత్రం ప్రామాణికంగా పనిచేస్తుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో కార్డును పొందడం మంచిది.