అన్నా డీఎంకేని కుదిపేసే పనిలో విజయ్
తమిళనాడులో మరో ఆరు నెలల తేడాలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ ఈసారి రసవత్తరంగా ఉండబోతోంది అన్నది అంతా అనుకుంటున్న మాట.
By: Satya P | 28 Nov 2025 9:03 AM ISTతమిళనాడులో మరో ఆరు నెలల తేడాలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ ఈసారి రసవత్తరంగా ఉండబోతోంది అన్నది అంతా అనుకుంటున్న మాట. ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్ తరం తర్వాత జనంలో ఎక్కువ చరిష్మా ఉన్న వారుగా సూపర్ స్టార్ డం కలిగిన హీరోగా విజయ్ ని అంతా భావిస్తారు. విజయ్ 2021లోనే రాజకీయాల పట్ల ఆసక్తిని చూపించారని చెబుతారు. అయితే సరైన సమయం అన్నీ చూసుకుని ఆయన 2026 ఎన్నికలకు సిద్ధపడుతూ ముందుకు వచ్చారు ఆయన ఏడాదిన్నరగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తూ వస్తున్నారు. గడచిన కొంతకాలంగా జనంలోకి వెళ్తున్నారు. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన సభలలో తాజాగా తొక్కిసలాట జరిగి 42 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన తరువాత విజయ్ పర్యటనల జోరు తగ్గింది కానీ జనంలో ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది అని విశ్లేషణలు ఉన్నాయి.
అందరి చూపూ అటు వైపే :
ఈ క్రమంలో విజయ పార్టీ మీద రాజకీయంగా ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది. ఆయన తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నా కచ్చితంగా ముప్పయి శాతానికి పైగా ఓటు షేర్ ని రాబట్టుకోగలుతారు అని కూడా అంచనాలు వేస్తున్న వారు ఉన్నారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలలో ఉన్న నేతలలో కూడా విజయ్ పార్టీ మీద ఫోకస్ పెరిగింది. అధికార డీఎంకే నుంచి విపక్ష అన్నా డీఎంకే దాకా అందరూ విజయ్ పార్టీ గురించి ఆలోచిస్తున్న నేపధ్యం ఉంది. ఈసారి టికెట్లు అనుకున్న చోట రాకపోయినా పక్కన పెట్టినా బిగ్ షాట్స్ అనదగిన వారే విజయ్ పార్టీ వైపు వెళ్ళే చాన్స్ ఉందని అంటున్నారు. విజయ్ పార్టీ ఇప్పటికే చాలా చోట్ల దిగువ స్థాయి నేతల చేరికతో సందడి చేస్తోంది.
అన్నా డీఎంకే నుంచి :
ఈ క్రమంలో అధికార డీఎంకే నుంచి ప్రస్తుతానికి వలసలు విజయ్ పార్టీ వైపుగా ఉండే చాన్స్ తక్కువ కానీ ప్రతిపక్ష అన్నా డీఎంకే వైపు నుంచి అయితే జోరు పెరిగే వీలు ఉందని అంటున్నారు. దానికి కారణం అన్నా డీఎంకేలో జనాకర్షణ నాయకులు లేకపోవడం, పైగా పార్టీలో నాయకత్వ విభేదాలు బీజేపీతో పొత్తు కొందరికి నచ్చని వైనాలు ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇక పొత్తుల కారణంగా సీటు రాని వారు కూడా విజయ్ పార్టీనే నమ్ముకుని ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే కుదిపేసే ఒక కీలక సంఘటన జరిగింది.
దిగ్గజ నేత చేరిక :
అన్నా డీఎంకే పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకుడు కురువృద్ధుడు అనదగిన ఒక సీనియర్ మోస్ట్ నేత తాజాగా విజయ్ పార్టీలో చేరిపోయారు. ఆయన పేరు సెంగోట్టియన్. వయసు ఏడున్నర దశాబ్దాలు. ఆయన ఎంజీఆర్ నాటి నుంచి అన్నా డీఎంకేలో ఉన్నారు. మరో మాట చెప్పాలీ అంటే అన్నాడీఎంకే స్థాపించిన వారిలో కూడా ఆయన ఒకరని చెబుతారు ఇక ఆయా జయలలితకు అత్యంత సన్నిహిత నేతగా ఉన్నారు. ఒక దశలో ఆయనే జయలలిత మరణాంతరం సీఎం కావాల్సిన వారు అని ప్రచారం సాగింది. ఇక ఆయన తన రాజకీయ జీవితంలో ఒక్కసారి తప్ప ప్రతీ సారీ గెలుస్తూ వస్తున్న ఆరు. ఆయన విజయ్ పార్టీలో చేరడంతో అన్నా డీఎంకేలో భారీ రాజకీయ ప్రకంపనలే సంభవించాయి.
ఊపు మీద కొత్త పార్టీ :
ఈ కురు వృద్ధుడు విజయ్ పార్టీలో చేరడంతో తమిళనాడులో కొత్త ఊపు కనిపిస్తోంది. అన్నాడీఎంకే నుంచి మరిన్ని చేరికలు తొందరలోనే ఉంటాయని అంటున్నారు. ఇక విజయ్ ప్లాన్ కూడా అదే అంటున్నారు. నిజానికి తొక్కిసలాట ఘటన తరువాత అన్నా డీఎంకే బీజేపీ విజయ్ కి మద్దతుగా నిలిచాయి. ఆయన పార్టీతో పొత్తుకు ప్రయత్నం చేశాయి. కానీ విజయ్ మాత్రం దాని మీద వేరేగా ఆలోచిస్తున్నారు. పొత్తు కంటే అన్నాడీఎంకేలో సీనియర్లను మంచి నేతలను తన వైపు తిప్పుకుంటే గ్రౌండ్ లెవెల్ లో కొత్త పార్టీకి సంస్థాగతంగా బలం వస్తుందని ఆ మీదట తన గ్లామర్ తో డీఎంకేకు గట్టిగా ఢీ కొట్టవచ్చు అని భావిస్తున్నారుట. ఇప్పటికే వర్గ పోరుతో సతమతం అవుతున్న అన్నా డీఎంకేలో ఇపుడు విజయ్ పార్టీ కొత్త చిచ్చునే పెట్టబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏమి జరుగుతుందో.
