బిగ్ టెక్ కంపెనీలకు హెచ్-1బి వీసా పై సెనేటర్ల కఠిన ప్రశ్నలు
అమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీల నియామక విధానాలు ఇప్పుడు అమెరికా సెనేట్ దృష్టికి వచ్చాయి.
By: A.N.Kumar | 27 Sept 2025 3:00 AM ISTఅమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీల నియామక విధానాలు ఇప్పుడు అమెరికా సెనేట్ దృష్టికి వచ్చాయి. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న (లేఅఫ్ల్స్) తరుణంలో ఈ కంపెనీలు హెచ్-1బి వీసా కార్మికులపై ఎంతగా ఆధారపడుతున్నాయనే దానిపై సెనేట్ సభ్యులు కఠినంగా ప్రశ్నిస్తున్నారు.
బిగ్ టెక్ కంపెనీలకు సెనేటర్ల లేఖలు
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. సెనేట్ జుడిషియరీ కమిటీ చైర్మన్ చక్ గ్రాస్లే (రిపబ్లికన్, ఆయోవా) , ర్యాంకింగ్ మెంబర్ డిక్ డర్బిన్ (డెమోక్రాట్, ఇల్లినాయిస్) ముఖ్యమైన టెక్ , ఫైనాన్స్ కంపెనీలకు లేఖలు రాశారు. దేశంలో అత్యధికంగా హెచ్-1బి వీసాలను వినియోగిస్తున్న సంస్థలైన అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, జెపీమార్గన్ చేస్ వంటి వాటిని తమ నియామక విధానాలను వివరించాలని డిమాండ్ చేశారు.
సెనేటర్ల ప్రధాన ప్రశ్నలు
బిగ్ టెక్ కంపెనీల నుండి సెనేటర్లు ప్రధానంగా తెలుసుకోవాలనుకున్న అంశాలు ఇవి.. కంపెనీల్లో ప్రస్తుతం ఎంతమంది హెచ్-1బి వీసా ఉద్యోగులు పనిచేస్తున్నారు? ఆ వీసా ఉద్యోగులకు కంపెనీలు చెల్లిస్తున్న జీతం ఎంత? హెచ్-1బి ఉద్యోగులను నియమించడం ద్వారా అమెరికన్ ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగాలు కోల్పోయారా లేదా మార్చబడ్డారా తెలుపాలని కోరారు.
అమెరికన్ టాలెంట్‌పై అనుమానాలు
సెనేటర్లు తమ వైఖరిని గట్టిగా వ్యక్తం చేశారు. అమెజాన్ CEO ఆండి జాస్సీకి రాసిన లేఖలో "అంతటా అమెరికన్ టాలెంట్ అందుబాటులో ఉండగా, అమెజాన్ ఇలాంటి స్థానం కోసం అమెరికన్ టెక్ ఉద్యోగులను కనుగొనలేకపోవడం మాకు కష్టంగా అనిపిస్తోంది" అని పేర్కొన్నారు.
సెనేటర్ గ్రాస్లే సోషల్ మీడియాలో మాట్లాడుతూ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్) గ్రాడ్యుయేట్లు సాధారణ జనాభా కంటే ఎక్కువ నిరుద్యోగంతో బాధపడుతున్నారని తెలిపారు. దీని అర్థం "బిగ్ టెక్ అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ లక్షలకు పైగా హెచ్-1బి వీసా అభ్యర్థనలు చేస్తోందనే" విమర్శను ఆయన ఎక్కుపెట్టారు.
వివాదంలో OPT - నిబంధనల మార్పులు
ఈ వివాదం కేవలం హెచ్-1బి వీసాకే పరిమితం కాలేదు. ఫారిన్ విద్యార్థులకు జారీ చేసే F-1 స్టూడెంట్ వీసా హోల్డర్లు OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ) కార్యక్రమంలో 12 నుండి 36 నెలల వరకు పనిచేయగల సామర్థ్యాన్ని కూడా సీనేటర్ గ్రాస్లే ప్రశ్నించారు. ఈ ఉద్యోగులు అధికారికంగా వర్క్ ఫోర్స్‌లో లెక్కించబడరు..పన్నులు చెల్లించరు అని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రాస్లే హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ను (DHS) విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్లను నిలిపివేయాలని సూచించారు.
గతంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి దరఖాస్తు రుసుములను పెంచింది. లాటరీ విధానాన్ని వేతన-ఆధారిత నియామక విధానంతో మార్చడానికి ప్రయత్నించింది.
పారదర్శకత వైపు అడుగులు
అమెరికాలో లేఅఫ్ల్స్ పెరుగుతున్న నేపథ్యంలో హెచ్-1బి వీసా నిబంధనలు.. స్థానిక ఉద్యోగ అవకాశాలపై ఈ వివాదం తీవ్రమైన కొత్త చర్చకు దారితీస్తోంది. సెనేట్ సభ్యుల ఈ చర్యల వల్ల బిగ్ టెక్ కంపెనీలు తమ నియామక విధానాలను మరింత పారదర్శకంగా చేయవచ్చని నిపుణులు ఆశిస్తున్నారు. స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
