Begin typing your search above and press return to search.

పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. ఇలా చేస్తే సేఫ్.. లేదంటే సైబర్ కేసుల్లో ఇరుక్కోవచ్చు!

ముఖ్యంగా మీ పాత మొబైల్‌ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళితే.. దాని ప్రభావం మీపై పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By:  A.N.Kumar   |   14 Sept 2026 6:00 PM IST
పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. ఇలా చేస్తే సేఫ్.. లేదంటే సైబర్ కేసుల్లో ఇరుక్కోవచ్చు!
X

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనే ఉత్సాహంతో చాలామంది తమ పాత ఫోన్లను విక్రయిస్తుంటారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు, లోకల్‌ మొబైల్‌ షాపులు లేదా తెలిసిన వ్యక్తులకు ఫోన్లను అమ్మడం సాధారణంగా మారిపోయింది. అయితే పాత ఫోన్‌ను విక్రయించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం తర్వాత అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పాత మొబైల్‌ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళితే.. దాని ప్రభావం మీపై పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళితే..

ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు పాత మొబైల్‌ ఫోన్లను సేకరించి వాటిని వివిధ రకాల మోసాలకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పాత ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత దానిని మరో వ్యక్తికి విక్రయించడం.. దాని ద్వారా నకిలీ ఖాతాలు లేదా ఇతర మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించడం వంటివి జరుగుతుంటాయి.

ఇలాంటి సందర్భాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్‌ కీలక ఆధారంగా మారుతుంది. ఆ ఫోన్‌ గతంలో మీ వద్ద ఉన్నదని రికార్డుల ద్వారా గుర్తిస్తే.. మీరు నేరానికి సంబంధం లేకపోయినా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. కొన్ని సందర్భాల్లో కేసు విచారణలో భాగంగా పోలీసులను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ఫోన్ అమ్మే ముందు ఇవి తప్పనిసరిగా చేయండి

పాత మొబైల్‌ను ఇతరులకు విక్రయించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా సిమ్‌ కార్డును తొలగించాలి. సిమ్‌ అలాగే ఉంచి ఫోన్‌ను విక్రయించకూడదు. అలాగే మెమరీ కార్డు ఉంటే దానిని కూడా తీసేయాలి. వ్యక్తిగత డేటాను పూర్తిగా తొలగించాలి. ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్‌, వాట్సాప్‌ డేటా, ఈమెయిల్‌ ఖాతాలు, బ్యాంకింగ్‌ యాప్స్‌, సోషల్‌ మీడియా ఖాతాలు వంటి వాటి నుంచి లాగ్‌అవుట్‌ అవ్వాలి. అనంతరం ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాలి.

కొనుగోలుదారు వివరాలు తీసుకోండి

ఫోన్‌ను ఎవరికి విక్రయిస్తున్నారో వారి పేరు, ఫోన్‌ నంబర్‌, సాధ్యమైనంతవరకు చిరునామా వంటి వివరాలను నమోదు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మొబైల్‌ షాప్‌కు ఇస్తున్నట్లయితే అమ్మకానికి సంబంధించిన రశీదు లేదా బిల్లు తప్పకుండా తీసుకోవాలి. ఫోన్‌ విక్రయించిన తేదీ, మోడల్‌, ఐఎంఈఐ నంబర్‌ వంటి వివరాలు అందులో ఉంటే మరింత మంచిది.

పాత ఫోన్‌ను అమ్మడం తప్పు కాదు. కానీ ఎవరికి అమ్ముతున్నాం, ఫోన్‌లో మన డేటా పూర్తిగా తొలగించామా.. విక్రయానికి సంబంధించిన ఆధారం మన దగ్గర ఉందా అనే విషయాల్లో జాగ్రత్త వహించాలి. కొద్దిపాటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్‌ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.