వైద్యులను హేళన చేస్తే తాట తీస్తాం!
ప్రణిత్ మోరే షోలో వ్యక్తమైన ఆయా వ్యాఖ్యలు వైద్య సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని..
By: Srikanth Kontham | 14 Jun 2026 2:25 PM ISTఎంటర్‌టైన్‌మెంట్.. రియాలిటీ షోలు .. టాక్ షోల వేదికగా సెలబ్రిటీలు చేసే కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. వినోదం పేరుతో పరిధులు దాటి మాట్లాడటం, తోటి వ్యక్తులను .. వృత్తులను తక్కువ చేసి చూపించడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రణిత్ మోరే షోలో సెజల్ పవార్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సంచలనం రేపుతున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలను ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) జాతీయ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. మెడికల్ రంగానికి.. వైద్య విద్యార్థులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. ఎంతో కష్టపడి, అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యం కోసం పాటుపడే వైద్యులను .. వైద్య విద్యార్థుల శ్రమను హేళన చేసే విధంగా బహిరంగ వేదికలపై మాట్లాడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఐమ్సా స్పష్టం చేసింది.
ప్రణిత్ మోరే షోలో వ్యక్తమైన ఆయా వ్యాఖ్యలు వైద్య సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని.. అందుకే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివాదంపై ఐమ్సా అధ్యక్షుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. `సెజల్ పవార్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవి. వినోద కార్యక్రమాల్లో మాట్లాడేటప్పుడు కనీస బాధ్యత, విచక్షణ ఉండాలని హితవు పలికారు. రేటింగులు, వ్యూస్ , చప్పట్ల కోసం పవిత్రమైన వృత్తిని అందులోని వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందని దీనిపై తక్షణమే సదరు వ్యక్తులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.భవిష్యత్ లో ఇలాంటివి మళ్లీ రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇటీవలి కాలంలో డిజిటల్ - ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్ క్రియేటర్లు, సెలబ్రిటీలు పాపులారిటీ కోసం వివాదాస్పద అంశాలను ఎంచుకోవడం కామన్ అయిపోయింది. అయితే భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరుల హక్కులను, గౌరవాన్ని భంగపరిచేలా ఉండకూడదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రింబవళ్లు శ్రమించే వైద్య విద్యార్థుల మానసిక స్థితిని, వారి సామాజిక బాధ్యతను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతం వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కంటెంట్ క్రియేషన్ .. షోల నిర్వహణపై స్వయం నియంత్రణ ఉండాలనే డిమాండ్లు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. స్క్రిప్ట్ రాసేటప్పుడు ..మాట్లాడేటప్పుడు ఏయే అంశాలు వివాదాస్పదంగా మారుతాయి? ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి? అనే విషయాలపై షో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా అత్యవసర సేవలు అందించే మెడికల్, పోలీస్ వంటి రంగాలపై హేళన పూర్వక వ్యాఖ్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. వినోదం అనేది ఎవరినీ బాధించేలా ఉండకూడదు. ప్రణిత్ మోరే షో ఉదంతం తో ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ..నిత్యావసర సేవా రంగాలకు మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవ రేఖ మరోసారి చర్చకు వచ్చింది. ఐమ్సా లాంటి పెద్ద సంస్థలు ఈ విషయంపై గళం విప్పడం వల్ల భవిష్యత్తులోనైనా? సెలబ్రిటీలు మాటల విషయంలో జాగ్రత్త వహిస్తారని ఆశీంచొచ్చు.
