Begin typing your search above and press return to search.

ఎఫైర్స్ కోసం ప్రత్యేక యాప్.. ఎంతకు తెగించారురా? ఎటు పోతోంది సమాజం?

వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందుతున్న ఎఫైర్ డేటింగ్ యాప్‌లపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి యాప్‌లలో 80 శాతం మంది మన దేశపు పురుషులే ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాత్కాలిక ఆనందం కోసం దాంపత్య బంధంలో నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, కుటుంబాలు, పిల్లల జీవితాలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందనే చర్చ సాగుతోంది.

By:  A.N.Kumar   |   10 Nov 2026 1:00 AM IST
ఎఫైర్స్ కోసం ప్రత్యేక యాప్.. ఎంతకు తెగించారురా? ఎటు పోతోంది సమాజం?
X

ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట.. కష్టసుఖాల్లో కలిసి నడవడానికి ఏడడుగులతో వేసుకున్న బలమైన పునాది.. కానీ నేటి టెక్నాలజీ యుగంలో ఆ పునాదుల కింద డైనమైట్లు పేలుతున్నాయి. భార్యతో కాస్త బోర్ కొట్టిందో లేదో.. ఫోన్లో కొత్త యాప్ ఓపెన్ చేసి మరో లోకంలోకి జంప్ అయిపోతున్నారు మహాపురుషులు. వివాహేతర సంబంధాల కోసం ఏకంగా ప్రత్యేక యాప్‌లు పుట్టుకొస్తుంటే.. అసలు ఈ సమాజం ఎటు ప్రయాణిస్తోందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.

తాజాగా అందుబాటులోకి వచ్చిన ఇలాంటి రహస్య డేటింగ్ ఎఫైర్ యాప్‌లలో 80 శాతం మంది మన దేశపు మగాళ్లూ ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం చూస్తుంటే గుండెల్లో గుబులు పుట్టక మానదు. ఇక్కడ ఎవరికీ ప్రేమ మీద భక్తి లేదు..దొంగచాటుగా తప్పు చేస్తున్నామనే క్షణికమైన థ్రిల్‌ను కూడా కొందరు వ్యాపారంగా మార్చేసుకుంటున్నారు. ఇంట్లో భార్య వంట గదిలో వంట చేస్తుంటే భర్త గదిలో కూర్చుని ఫోన్ స్క్రీన్‌పై మరో ప్రపంచాన్ని వెతుక్కోవడం పరిపాటిగా మారింది.

నిజానికి టెక్నాలజీని దేవుడు కమ్యూనికేషన్ కోసం ఇస్తే కొందరు దాన్ని కాపురాలను కూల్చే అస్త్రంగా వాడుకుంటున్నారు. రొటీన్ అయిపోయిందని బోర్ కొడితే కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సింది పోయి యాప్‌లలో కొత్త మొహాల కోసం వెతకడం ఏరకమైన తెగింపు? గోప్యత మాటున సాగే ఈ బంధాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయేమో కానీ ఆ తర్వాత నిప్పుల మీద నడిపించేస్తాయి.

ఒక రోజు బయటపడితే భార్య ఇచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా పెద్దల తప్పులకి పసిపిల్లలు బలికావాల్సి వస్తోంది. తల్లిదండ్రుల మధ్య నమ్మకం చెడి.. కాపురాలు కూలిపోతే ఆ పిల్లల మానసిక పరిస్థితి ఏమవ్వాలి? ఫైవ్ మినిట్స్ ఆనందం కోసం ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న కుటుంబాన్ని గాలికి వదిలేయడం ఏమాత్రం తెలివైన పని కాదు.

టెక్నాలజీ మనుషులను దగ్గర చేయడానికే కానీ కాపురాలను విడదీయడానికి కాదు. మార్కెట్లో ఎన్ని యాప్‌లు పుట్టుకొచ్చినా.. ఒకసారి పగిలిపోయిన నమ్మకాన్ని తిరిగి అతికించే సూపర్ గ్లూ యాప్‌ను మాత్రం ఇప్పటివరకు ఏ సైంటిస్టూ కనిపెట్టలేదనే నిజాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ఇలాంటి ఎఫైర్స్ యాప్ ల జోలికి వెళ్లకుండా మీ కాపురాలను కలకాలం చల్లగా ఉంచుకుంటే అందరికీ మంచిది.