రెండో పెళ్లిపై ఇండియన్స్ ఆలోచన... సర్వేలో ఆసక్తికర విషయలు!
కారణం ఏదైనా, కారకులు ఎవరైనా.. పరిస్థితులు ఏవైనా, తదనంతర పరిణామాలు ఎలాగున్నా.. ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 22 Dec 2025 2:00 PM ISTకారణం ఏదైనా, కారకులు ఎవరైనా.. పరిస్థితులు ఏవైనా, తదనంతర పరిణామాలు ఎలాగున్నా.. ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే.. విడాకుల అనంతరం వివాహం చేసుకునే విషయంలో భారతీయుల దృక్పథం మారుతోందని.. రెండో పెళ్లి విషయంలో వారి ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఒకసారి విడాకులు అయిన తర్వాత రెండో పెళ్లి విషయంలో చాలా మంది ఆసక్తి చూపించరని.. ప్రతీ అబ్బాయి ఇలానే ఉంటాడేమో అని అమ్మాయిలు అనుకుంటే.. ప్రతీ ఆడదీ ఇంతే అనే నిర్ధారణకు పురుషుడు వచ్చేస్తుంటాడని.. మరికొంతమంది తమ తొలి భాగస్వామి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక రాటుదేలి పోయి, రెండో వివాహంపై ఆసక్తి చూపించరని అంటుంటారు.
మరికొంతమంది మాత్రం.. ఇది మరో గొప్ప అవకాశం అనుకుని లైఫ్ ని రీస్టార్ట్ చేస్తారని చెబుతారు. ఈ నేపథ్యంలో రెండో వివాహంపై ప్రజల ఆలోచనా విధానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో.. ప్రత్యేకంగా వారికోసమే ఏర్పాటు చేసిన రీబౌన్స్ మ్యాచ్ మేకింగ్ యాప్ ఓ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య జరిగిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఇందులో భాగంగా... సర్వేలో పాల్గొన్న వారిలో 28% కంటే ఎక్కువ మంది తమ విడాకుల తర్వాత తిరిగి లైఫ్ ని ప్రారంభించాలని ఆసక్తి చూపుతున్నారని.. ముగిసిన వివాహం తమ జీవితాలను డిసైడ్ చేయకూడదని భావిస్తున్నారని తేలింది. దీని కోసం గతంలో వివాహం చేసుకున్న 28 - 50 సంవత్సరాల మధ్య వయసున్న 5,837 మందిని సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైంది.
ఇందులో ప్రధానంగా టైర్ 1 నగరాల నుంచి.. విడాకులు తీసుకున్న మహిళల్లో 35% కంటే ఎక్కువ మంది ప్రేమకు మరో అవకాశం ఇస్తూ.. రెండో అవకాశాలకు సిద్ధంగా ఉన్నారని సర్వే చూపిస్తుంది. ఇదే క్రమంలో 30 - 40 ఏళ్ల మధ్య ఉన్న పురుషుల్లో 5 మందిలో 3 మంది భావోద్వేగ అనుకూలతల కోసం చూస్తున్నారని.. 21% మంది మాత్రం తాము ఇంకా దుర్భలత్వంతో పోరాడుతున్నామని చెబుతున్నారు!
ఈ క్రమంలో... ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి టైర్ 1 నగరాల్లో ఈ విషయంలో స్త్రీ, పురుషుల మనస్తత్వంలో మార్పు ఎక్కువగా కనిపిస్తుందని సర్వే తెలిపింది. ఇక్కడ రెండో పెళ్లి పట్ల అంగీకారం, బహిరంగత పెరుగుతోందని.. అయితే టైర్ 2 నగరాలు ఇప్పటికీ ఫ్యామిలీ, సామాజిక ఒత్తిడిలో ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించింది.
