Begin typing your search above and press return to search.

బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే ఈ హెచ్చ‌రిక మీ కోస‌మే!

ఇటీవ‌ల కాలంలో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న విష‌యం తెలిసిందే. దీనికి కార‌ణం.. నిశ్చింత మైన పెట్టుబ‌డికి అవ‌కాశం ఉన్న మార్గంగా ప‌సిడి మారడ‌డ‌మే.

By:  Garuda Media   |   9 Nov 2025 8:43 PM IST
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే ఈ హెచ్చ‌రిక మీ కోస‌మే!
X

ఇటీవ‌ల కాలంలో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న విష‌యం తెలిసిందే. దీనికి కార‌ణం.. నిశ్చింత మైన పెట్టుబ‌డికి అవ‌కాశం ఉన్న మార్గంగా ప‌సిడి మారడ‌డ‌మే. దీంతో ఇబ్బడి ముబ్బ‌డిగా బంగారంపైనే పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఫ‌లితంగా ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం కొంత త‌గ్గుముఖం ప‌ట్టినా.. మ‌రో నాలుగు రోజుల్లో పెళ్లిళ్ల సీజ‌న్ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో బంగారానికి మ‌రింత డిమాండ్ పెర‌గ‌నుంది. దీంతో పెట్ట‌బ‌డులు మ‌రోసారి ఊపందుకునే అవ‌కాశం ఉంది.

అయితే.. ఈ స‌మ‌యంలో భార‌త సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్‌(సెబీ) కీల‌క హెచ్చ‌రిక చేసింది. ఆన్ లైన్ మోసాల‌కు బంగారం పెట్టుబ‌డులు కూడా దారి తీస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. ముఖ్యంగా వివిధ ఆన్‌లైన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న "డిజిటల్ గోల్డ్" లేదా "ఇ-గోల్డ్" ఉత్పత్తులలో పెట్టుబడి పెడితే.. ఇక‌, ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేన‌ని హెచ్చ‌రించింది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETF), ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGR), ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టులు వంటి నియంత్రిత ఉత్పత్తుల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు ఉంద‌ని తెలిపింది.

అలా కాకుండా అధిక లాభాల కోసం ఆన్‌లైన్ "డిజిటల్ గోల్డ్" ఆఫర్‌ల జోలికి వెళ్తే.. సొమ్ములు వెన‌క్కి రావ‌ని తెలిపింది. దీనికి సెబీ గ్యారెంటీ ఉండ‌ద‌ని, అవి నియంత్ర‌ణ ప‌రిధిలోకి కూడా రావని స్పష్టం చేసింది. యాప్ ఆధారిత ఆన్‌లైన్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లు భారీ ఆఫ‌ర్ల‌తో ప్రజాదరణ కోసం ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో పెట్టుబ‌డి దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. వినియోగదా రులు పాక్షిక పరిమాణాలలో బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయడానికి కూడా సాహ‌సించ‌వ‌ద్ద‌ని తెలిపింది. ఈ ధోరణి భద్రత, నియంత్రణ లేని వ్య‌వ‌స్థ‌గా పేర్కొంది.

"ఇటువంటి డిజిటల్ బంగారు ఉత్పత్తులు పెట్టుబడిదారులకు గణనీయమైన నష్టాలను కలిగిస్తాయి. పెట్టుబడిదారులను ఆపరేషనల్ రిస్క్‌లకు గురిచేయవచ్చు" అని సెబీ హెచ్చరించింది. సెక్యూరిటీల మార్కెట్ ఫ్రేమ్‌వర్క్ కింద అందుబాటులో ఉన్న పెట్టుబడిదారుల రక్షణ విధానాలు ఆన్‌లైన్ ట్రేడ‌ర్ల‌కు వర్తించవని కూడా పేర్కొంది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు రిజిస్టర్డ్ మధ్యవర్తులు అందించే సెబీ-నియంత్రిత సాధనాల ద్వారా మాత్రమే అలా చేయాలని సూచించింది.