భయపెడుతున్న స్క్రబ్ టైఫస్...ప్రాణాంతకమా ?
ఈ వ్యాధి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారంలో ఉండడంతో అసలు ఏమిటి ఇది అన్నది అంతా వాకబు చేస్తూ కంగారు పడుతున్నారు కరోనా వైరస్ సమయంలో కూడా జనాలు తెలిసీ తెలియని సమాచారంతో తీవ్ర ఆందోళన చెందారు.
By: Satya P | 4 Dec 2025 8:54 AM ISTఏపీలో ఒక ఒక వ్యాధి ఇపుడు అందరినీ భయపెడుతోంది. ఈ వ్యాధి కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారంలో ఉండడంతో అసలు ఏమిటి ఇది అన్నది అంతా వాకబు చేస్తూ కంగారు పడుతున్నారు కరోనా వైరస్ సమయంలో కూడా జనాలు తెలిసీ తెలియని సమాచారంతో తీవ్ర ఆందోళన చెందారు. ఆ వైరస్ పోయింది గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండొచ్చు అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో ఇపుడు కొత్తగా స్క్రబ్ టైఫస్ పేరుతో వ్యాధి విస్తరిస్తోంది అన్న వార్తతో పిడుగుపాటుగానే జనాలు భావిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు ఇవి :
ఇదిలా ఉంటే స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యాధికి కారణమైన పురుగు కుట్టినప్పుడు జ్వరం, తలపోటు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, కణుపుల వాపు, వినికిడి తగ్గుదల, దగ్గు శ్వాస ఆడకపోవడం వంటివి లక్షణాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని చికిత్సతో పాటు మందులు వాడటం ద్వారా నివారించవచ్చునని చెప్పారు. విశాఖ జిల్లాలో చూస్తే ఇప్పటిదాకా స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి 2023 లో 12 పాజిటివ్ కేసులు, 2024 లో 11 పాజిటివ్ కేసులు, 2025 లో 11 పాజిటివ్ కేసులు కనుగొన్నట్లుగా తెలిపారు. ఈ కేసులలో ఒక్క మరణం కూడా సంభవించలేదని పేర్కొన్నారు.
స్పష్టత ఇదే :
ఇక స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ వ్యాధి గురించి ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత చాలా అవసరం అని అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదకర స్థాయికి వెళ్ళేలా పరిష్తితి ఉంటుందని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే ప్రతీ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కారణంగా తీవ్రమైన జ్వరాలతో బాధపడే వారు ఇపుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఒకటేమిటి అన్నట్లుగా ఏపీలోని అన్ని జిల్లాల్లో సుమారుగా కేసున్నాయి.
గుర్తించకపోతేనే ముప్పు :
స్క్రబ్ టైఫస్ వ్యాధిని గుర్తించడంలో కనుక ఏ మాత్రం ఆలస్యం జరిగినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు. ఇక ఈ వ్యాధికి సంబంధించిన కేసులు చూస్తే కనుక విశాఖలో తో పాటు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. అలాగే . చిత్తూరు కాకినాడ తదితర జిల్లాలలో సైతం బాగానే కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ వ్యాధి మీద అవగాహన పెంచుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు ఏ మాత్రం లక్షణాలను కనిపించినా వైద్యులను సంప్రదిస్తే మందులతోనే తగ్గుతుందని చెబుతున్నారు. అందువల్ల ఈ వ్యాధి గురించి ఆందోళన కంటే అప్రమత్తత అవగాహన ముఖ్యమని సూచిస్తున్నారు.
ఈ బాక్టీరియా కారణం "
స్క్రబ్ టైఫస్ అన్న వ్యాధికి మూల కారణం ఓరియంటియా సుట్సుగాముషి అనే బాక్టీరియా అని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ రకమైన బాక్టీరియా ఎక్కువగా చిక్కటి పొదలు అలాగే తడి నేలలు, పాడుపడిన భూములు మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయని అంటున్నారు. ఇవి చూడడానికి చిన్నగా ఉంటాయని అయితే కంటికి కనిపిస్తాయి కానీ ఇవే ప్రమాదకరం అని ఎవరూ సీరియస్ గా తీసుకోరని అంటున్నారు. ముఖ్యంగా తోటలలో పనిచేసే వారు అలాగే మొక్కల మధ్య తిరిగే వారు ఈ పురుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్క్రబ్ టైఫస్ గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు.
