Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో మరో అద్భుతం.. కొత్తగా రెండు గ్రహాలు గుర్తింపు

ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్న ఈ కొత్త గ్రహాలకు 'TOI-1752 b', 'TOI-1752 c' అని పేర్లు పెట్టారు.

By:  Madhu Reddy   |   2 Sept 2026 3:49 PM IST
అంతరిక్షంలో మరో అద్భుతం.. కొత్తగా రెండు గ్రహాలు గుర్తింపు
X

అనంత విశ్వంలో మన సౌర కుటుంబానికి అవతల శాస్త్రవేత్తలు మరో గొప్ప అద్భుతాన్ని వెలికితీశారు. వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సుదూర అంతరిక్షంలో కొత్తగా రెండు వింత గ్రహాలను స్పెయిన్ ఖగోళ పరిశోధకులు గుర్తించారు. విశ్వంలో మనలాంటి జీవం ఎక్కడైనా ఉందా? మానవాళికి నివాసయోగ్యమైన మరో లోకం ఉందా? అనే శతాబ్దాల నాటి ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఇది అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ కొత్త గ్రహాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వం అంచుల్లో వెలుగుచూసిన కొత్త ప్రపంచాలు:

ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్న ఈ కొత్త గ్రహాలకు 'TOI-1752 b', 'TOI-1752 c' అని పేర్లు పెట్టారు. ఇవి మన భూమికి సుమారు 337 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 'డ్రాకో' అనే నక్షత్ర మండలంలో ఉన్నాయి. ఇక అక్కడున్న ఒక చిన్న 'రెడ్ డ్వార్ఫ్ చుట్టూ ఇవి ప్రదక్షిణలు చేస్తున్నాయి. మన సూర్యుడి కంటే ఇది వేడి, పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఈ జంట గ్రహాలు సైంటిస్టులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

నిప్పుల కొలిమిలా మొదటి గ్రహం:

ఈ రెండు గ్రహాలలో 'TOI-1752 b' అనేది మన భూమి కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉంది. అయితే, ఇది తన నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల తీవ్రమైన వేడితో నిప్పుల కొలిమిలా మండిపోతోంది. లావా రసంతో నిండిన నరకం లాంటి వాతావరణం అక్కడ ఉంది. ఇక దీనిపై ఎలాంటి జీవం మనుగడ సాగించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

జీవానికి అనుకూలంగా మరో 'సూపర్ ఎర్త్':

సైంటిస్టుల కళ్లలో అసలైన ఆశలు నింపింది రెండో గ్రహమైన 'TOI-1752 c'. మన భూమి కంటే ఐదు రెట్లు బరువుండే ఈ రాతి గ్రహంపై ప్రవహించే నీరు ఉండేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడ తగినంత వాతావరణం ఉంటే జీవజాలం మనుగడకు కావలసిన నీరు సమృద్ధిగా లభించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీంతో దీనిని మరో భూమిగా భావిస్తున్నారు.

శాస్త్రవేత్తల పరిశోధనా పద్ధతి:

స్పెయిన్‌కు చెందిన 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆఫ్ అండలూసియా' శాస్త్రవేత్త ఆల్బెర్టో పెలేజ్ టోర్రెస్ నేతృత్వంలో ఈ అన్వేషణ జరిగింది. నక్షత్రం కాంతిలో వచ్చే స్వల్ప మార్పులను 'ట్రాన్సిట్' పద్ధతి ద్వారా గమనించి వీటిని కనుగొన్నారు. కానరీ ఐలాండ్స్, హవాయిలోని శక్తివంతమైన 'ముస్కాట్' పరికరాలతో పాటు జపాన్‌లోని టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యారు.

గ్రహాలను గుర్తించినప్పటికీ, రాబోయే రోజుల్లో స్పేస్ టెలిస్కోప్‌ల ద్వారా అక్కడ వాతావరణం, నీటి ఆనవాళ్లను పూర్తిగా విశ్లేషించాల్సి ఉంది. దట్టమైన మబ్బుల పొరలు అడ్డురాకపోతే, భవిష్యత్తులో మానవాళికి నివాసయోగ్యమైన 'రెండో భూమి' దొరికినట్లేనని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఈ నూతన ఆవిష్కరణ ఒక సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.