అరిటాకు భోజనం.. సాంప్రదాయమే కాదు సైన్స్ కూడా!
మన పూర్వీకులు అరిటాకులో భోజనం చేయడానికి కేవలం సంప్రదాయం మాత్రమే కారణం కాదు, దాని వెనుక ఎంతో అద్భుతమైన సైన్స్ దాగుంది.
By: Madhu Reddy | 18 May 2026 7:00 PM ISTమన పూర్వీకులు అరిటాకులో భోజనం చేయడానికి కేవలం సంప్రదాయం మాత్రమే కారణం కాదు, దాని వెనుక ఎంతో అద్భుతమైన సైన్స్ దాగుంది. ఈ విషయాన్ని వివరిస్తూ ఒక చిన్న బాలుడు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నేటి తరం ప్లాస్టిక్ ప్లేట్ల వైపు వెళ్తుంటే, అరిటాకులోని ఆరోగ్య రహస్యాలను ఆ పిల్లాడు చెప్పిన విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక మళ్లీ అందరూ మన పాత ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు పయనించాలని కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలుడి వీడియో:
ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటే, ఈ పిల్లాడు మాత్రం మన సంస్కృతి వెనుక ఉన్న సైన్స్‌ను ప్రపంచానికి చాటిచెప్పాడు. అరిటాకులో తినడం వల్ల కలిగే లాభాలను ఆ బాలుడు చాలా స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఈ తరం పిల్లలకి ఇలాంటి విషయాలు తెలియడం చాలా అవసరం" అంటూ లైకులు, షేర్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
అరిటాకులో దాగున్న అసలైన సైన్స్:
వేడి వేడి అన్నం, కూరలు అరిటాకుపై వడ్డించినప్పుడు ఆ వేడికి ఆకులో ఉండే 'పాలిఫెనాల్స్' అనే సహజ యాంటీఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి మనం తినే ఆహారంలో కలిసి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇక దీనివల్ల మన శరీరానికి అద్భుతమైన రోగనిరోధక శక్తి లభిస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ఇవి మనల్ని కాపాడతాయని సైన్స్ చెబుతోంది.
ఆ రుచే వేరబ్బా!:
అరిటాకు పైన ఒక సహజమైన కొవ్వు పొర ఉంటుంది. వేడి పదార్థాలు దానిపై పడగానే ఆ పొర కరిగి భోజనానికి ఒక ప్రత్యేకమైన రుచిని, అద్భుతమైన సువాసనను అందిస్తుంది. ఇక అందుకే హోటళ్లలో లేదా పెళ్లిళ్లలో అరిటాకులో తిన్నప్పుడు వచ్చే తృప్తి, టేస్ట్ నార్మల్ ప్లేట్లలో తింటే అస్సలు రాదు. ఇక కెమికల్స్ ఉండే ప్లాస్టిక్ ప్లేట్ల కంటే ఇది వంద రెట్లు మేలు.
పర్యావరణానికి ఎంతో మేలు:
అరిటాకు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన ప్రకృతికి కూడా ఎంతో ఫ్రెండ్లీ. ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్లు భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడుతుంది, దీనివల్ల కాలుష్యం పెరుగుతుంది. కానీ అరిటాకులు వాడిన తర్వాత పారేస్తే చాలా త్వరగా మట్టిలో కలిసిపోయి మంచి ఎరువుగా మారుతాయి. ఇక పూర్వీకులు ప్రకృతికి హాని చేయని ఇలాంటి జీవన విధానాన్ని పాటించారు కాబట్టే అప్పట్లో అంత ఆరోగ్యంగా ఉండేవారు.
ఫాస్ట్ ఫుడ్ రంధి లో పడి మన పాత పద్ధతులను మర్చిపోతున్న ఈ రోజుల్లో, వైరల్ అవుతున్న ఈ బాలుడి వీడియో అందరి కళ్లూ తెరిపించేలా ఉంది. ఇక అరిటాకు భోజనం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సహజ కవచం. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం, మనమూ ప్లాస్టిక్‌ను పక్కన పెట్టి, మళ్లీ ఆరోగ్యం వైపు అడుగులు వేస్తూ అరిటాకు భోజనానికి జై కొడదాం.
