Begin typing your search above and press return to search.

రుతు పరిశుభ్రత - జీవించే హక్కు లో అంతర్భాగం

కౌమార బాలికలతో పాటు మహిళలకు రుతు పరిశుభ్రత హక్కు జీవించే హక్కు లో అంతర్భాగమని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

By:  Satya P   |   31 Jan 2026 11:00 PM IST
రుతు పరిశుభ్రత - జీవించే హక్కు లో అంతర్భాగం
X

కౌమార బాలికలతో పాటు మహిళలకు రుతు పరిశుభ్రత హక్కు జీవించే హక్కు లో అంతర్భాగమని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం రుతు పరిశుభ్రత హక్కు అతి ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. బాలికలు అలాగే మహిళలకు గౌరవంతో కూడిన ఆరోగ్య సేవలు దేశంలో దక్కాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళలకు సమానత్వాన్ని సమాన అవకాశాలను నిర్ధారించడానికి తగిన పద్ధతులను అనుసరించాలని వారి గౌరవం కాపాడాలని సుప్రీంకోర్టు దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా దేశంలోని పాఠశాలలు కౌమార దశలో ఉన్న బాలికలకు రుతు పరిశుభ్రత విషయంలో కట్టుబడి ఉండేలా సరైనా చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించింది.

ఇవన్నీ తప్పనిసరి :

ఇక దేశంలోని ప్రతి పాఠశాల కౌమార బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా అంతా సవ్యంగా ఉండేలా చూసుకోవాలని జస్టిస్ జెబి పార్దివాలా ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రాథమిక సౌకర్యాల లేకపోవడంతో రుతుస్రావం చుట్టూ ఉన్న కళంకం బాలికల ఆరోగ్యం వారి విద్యని గోప్యతను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోందని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయాలను అన్నీ గమనించిన మీదటనే ఈ తరహా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా వెల్లడించింది.

జాతీయ విధానంగా :

ఇక దేశంలోని పాఠశాలలు క్రియాత్మకమైన తీరులో వ్యవహరించాలని, పరిశుభ్రమైన లింగ విభజన చేయబడిన టాయిలెట్లతో అక్కడ అంతా సిద్ధంగా ఉంచాలని పేర్కొంది. ముఖ్యంగా 6 నుండి 12వ తరగతి వరకు యుక్తవయస్సులో ఉన్న బాలికల పాఠశాలలలో పాఠశాలకు వెళ్లే బాలికలకు రుతు పరిశుభ్రత విధానం అన్నది జాతీయ విధానంగా మారాలని, ఆ విధంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాఠశాల బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్‌లు అందచేయడంతో పాటు తగినంత పారిశుధ్య సౌకర్యాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

ప్రైవేట్ సంస్థలకు కూడా :

ఇదిలా ఉంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేట్ సంస్థలకు ఈ రకమైన విధానం తప్పనిసరి అని అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. ప్రైవేట్ పాఠశాలలు బాలికలకు బాలురకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలో విఫలమైనా లేదా బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్‌లు అందుబాటులో ఉండేలా చూడకపోయినా ఆ సంస్థల గుర్తింపు రద్దు చేయబడతాయని కూడా సుప్రీం కోర్టు గట్టిగా హెచ్చరించింది.