Begin typing your search above and press return to search.

పిన్నెల్లి సోదరులకు సుప్రీం షాక్...

పల్నాడు ప్రాంతంలో సంచలనం సృష్టించిన జంటహత్యల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత ,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు శుక్రవారం సుప్రిం కోర్టు షాక్ ఇచ్చింది.

By:  Tupaki Political Desk   |   28 Nov 2025 2:37 PM IST
పిన్నెల్లి సోదరులకు సుప్రీం షాక్...
X

పల్నాడు ప్రాంతంలో సంచలనం సృష్టించిన జంటహత్యల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేత ,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు శుక్రవారం సుప్రిం కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసు నేపథ్యంలో వీరిద్దరు దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా ఇంతకు ముందు మంజూరైన మధ్యంతర బెయిల్ ను రద్దుచేస్తూ... జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ జంటహత్యకు సంబంధించి పిన్నెల్లి సోదరులు సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలను చెరిపివేసే ప్రయత్నం చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కేసుకు సంబంధించి వాదనలు విన్న ధర్మాసనం నిందితుల్ని అరెస్టు చేయవచ్చని, దీనికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టీకరించింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితుల చేతికి ఎలా వచ్చాయని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితుల తరఫు న్యాయవాదులు లొంగిపోవడానికి 2 వారాల సమయం అడిగినా...ముందస్తు బెయిల్ విషయంగా సమయం ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది.

ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరైన పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి సోదరులు బలమై రాజకీయశక్తులుగా ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో గత ప్రభుత్వం హయాంలో వీరిది తిరుగులేని ఆధిపత్యం. ఈ ఏడాది మే24న పల్నాడు ప్రాంతంలో జంటహత్య జరిగింది. గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూరునగర్ జిల్లాలో ఒక పెళ్ళికి హాజరై తిరిగి గ్రామానికి వెళుతుండగా..సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలవీరు వద్ద వారు వెళుతున్న బైక్ ను స్కార్పియో ఢీ కొట్టింది. మొద్దయ్య అక్కడికక్కడే మరణించగా, కొనఊపిరితో ఉన్న కోటేశ్వరరావును నిందితులు రాయితో కొట్టి చంపి, స్కార్పియో కారు వదలి పారిపోయారు.

టీడీపీకి చెందిన వీరిద్దరి మరణంపై అనుమానాలున్నట్లు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితోపాటు మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఏ3గా తోట గురవయ్య, ఎ4గా నాగరాజ్, ఏ5గా తోట వెంకటేశ్వర్లున్నారు. ఏ6గా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు. కాగా అరెస్టు నుంచి తప్పించుకోడానికి పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది.

పిన్నెల్లి సోదరులు గత వైఎస్సార్ సీపీ హయాంలో పల్నాడు ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉండటంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒటమి పాలయ్యారు. ఆ ఎన్నికల సమయంలో రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పోలింగ్ బూత్ లలో హల్ చల్ సృష్టించారు. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు పిన్నెల్లి సోదరులు షాక్ కు గురయ్యారు.