బ్యాంక్ ఖాతాలో డబ్బులు సేఫ్ అయినా.. ఎస్.బీఐ డేటా బ్రీచ్‌తో వ్యక్తిగత వివరాలకు ముప్పు ఉందా?
బ్యాంకు ఖాతాలోని డబ్బులు చోరీకి గురయ్యాయని కాదు.. కానీ మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా సైబర్ మోసగాళ్లు మీనే లక్ష్యంగా చేసుకుంటే? ఎస్‌బీఐ డేటా బ్రీచ్‌పై వెలుగులోకి వచ్చిన అనుమానాలు ఇప్పుడు కస్టమర్లలో ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
By: A.N.Kumar | 22 Oct 2026 12:00 AM ISTబ్యాంకు ఖాతాలోని డబ్బులు చోరీకి గురయ్యాయని కాదు.. కానీ మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా సైబర్ మోసగాళ్లు మీనే లక్ష్యంగా చేసుకుంటే? ఎస్‌బీఐ డేటా బ్రీచ్‌పై వెలుగులోకి వచ్చిన అనుమానాలు ఇప్పుడు కస్టమర్లలో ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బీఐ) లో అనుమానిత డేటా బ్రీచ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అక్టోబర్ 21న స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బ్యాంకు సమర్పించిన నివేదిక ప్రకారం.. డార్క్ వెబ్‌లో వెలుగుచూసిన డేటా ఆధారంగా సుమారు 3.75 లక్షల రికార్డులు ఎస్‌బీఐకి చెందినవిగా గుర్తించారు. అందులో దాదాపు 3,897 రికార్డుల్లో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు (పీఐఐ) ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు పూర్తిగా సురక్షితంగా ఉందని.. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అయితే కస్టమర్ల పర్సనల్ డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న ప్రచారానికి.. అసలు వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది. 3.75 లక్షల రికార్డులు కేవలం బ్యాంకుకు చెందినవిగా అనుమానిస్తున్న డేటా పరిధి మాత్రమే. ఇవన్నీ కస్టమర్ల వ్యక్తిగత వివరాలు కావు. ఇక 3,897 రికార్డులలో మాత్రమే వినియోగదారుల పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడీ, బ్రాంచ్ వివరాలు లేదా లోన్ లీడ్స్ వంటి వ్యక్తిగత గుర్తింపు వివరాలు ఉన్నాయి. అయితే ఈ డేటా అంతా పూర్తిగా బహిర్గతమైందని లేదా మోసగాళ్ళు ఇప్పటికే ఉపయోగించేశారని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం సీఈఆర్.టీ -ఇన్ ఎంప్యానెల్డ్ స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ సంస్థల ద్వారా పూర్తిస్థాయి పరిశోధన జరుగుతోంది.
డిజిటల్ యుగంలో బ్యాంకులోని డబ్బుల కంటే వ్యక్తిగత సమాచారమే నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా మారుతోంది. మీ ఖాతాలోని డబ్బులు చోరీ కాకపోయినా వ్యక్తిగత వివరాలు నేరగాళ్ల చేతికి చిక్కితే టార్గెటెడ్ ఫిషింగ్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది. మీ పేరు, హోమ్ బ్రాంచ్ వివరాలు చెప్పి నిజామైన బ్యాంకు ప్రతినిధులుగా నమ్మించడం.. ఖాతా బ్లాక్ అయిందని భయపెట్టి నకిలీ లింక్‌లు పంపి ఓటీపీ లేదా పాస్‌వర్డ్ సేకరించడం.. అలాగే లోన్ మెటాడేటా ఆధారంగా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజుల పేరిట మోసం చేయడం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.
ఎస్‌బీఐ కస్టమర్లు భయాందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండటం అత్యంత ఆవశ్యకం. ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే బ్యాంకు అధికారులు కూడా వీటిని ఎప్పటికీ అడగరు. ఎస్‌ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. అవతలి వ్యక్తికి మీ పేరు తెలుసని బ్లైండ్‌గా నమ్మకండి. ఏదేని అనధికార లావాదేవీ జరిగితే వెంటనే ఎస్‌బీఐని సంప్రదించండి.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఈ సవాలు కేవలం ఎస్‌బీఐకి మాత్రమే పరిమితం కాకుండా.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో డేటా భద్రత ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున.. సైబర్ సెక్యూరిటీ స్వతంత్ర నివేదికలు వచ్చే వరకు అపోహలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం.
