జ్వరమంటూ సామాన్యుడిలా వచ్చి షాకిచ్చారు.. సిబ్బందికి వణుకు పుట్టించారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు.. సిబ్బంది తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు.
By: Garuda Media | 30 Nov 2025 9:45 AM ISTప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు.. సిబ్బంది తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సౌరభ్ గౌర్.. తానే స్వయంగా సామాన్యుడి మాదిరి గుంటూరు జీజీహెచ్ ఓపీ వద్దకు వచ్చారు. తనకు జ్వరంగా ఉందని ఓపీ రాయించుకున్నారు. అక్కడి నుంచి వైద్యుడి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఫార్మసీకి వెళ్లి క్యూలో నిలుచొని మందులు తీసుకున్నారు.
దాదాపు గంట పాటు వివిధ విభాగాల్ని తానే స్వయంగా చూసిన ఆయన వద్దకు ఆసుపత్రి సూపరింటెండెంట్ పరుగున వచ్చి నమస్కరించటం.. ఆయన వెంట ఉండటంతో అప్పటివరకు తమదైన తీరుతో వ్యవహరిస్తున్న వైద్యులు.. సిబ్బంది ఒక్కసారి విస్తుపోయారు. సామాన్యుడి మాదిరి జ్వరంతో వచ్చిన వ్యక్తం ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కావటంతో ఉలిక్కిపడిన వారు.. వణికిపోయిన పరిస్థితి.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సామాన్యుడి మాదిరి జీజీహెచ్ కు వచ్చిన ఆయన.. తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పలు మార్పులను ప్రస్తావించారు. ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శే ఆసుపత్రికి వచ్చారన్న సమాచారం సిబ్బంది ఆగమేఘాలతో అక్కడకు చేరుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ ను వెంట పెట్టుకొని అనేక విభాగాల్లో తిరిగిన ఆయన.. ఒక పీజీ విద్యార్థి రోగులతో కటువుగా మాట్లాడుతున్న విషయాన్ని ప్రస్తావించి.. పిలిపించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. మందుల పేర్లను స్లిప్ మీద రాసి ఇచ్చే తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యుల పని తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసి.. పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
