పేపర్ టైగర్ల 'మక్కా' డీల్: అమెరికా చెయ్యి వదిలి... పాక్, టర్కీల 'కొంగు' పట్టుకున్న సౌదీ
దశాబ్దాలుగా "మా వెనక అమెరికా అంకుల్ ఉన్నాడులే " అని ధీమాగా ఉన్న సౌదీ అరేబియాకు హౌతీల డ్రోన్లు, క్షిపణులు ఊహించని షాక్‌లు ఇచ్చాయి
By: A.N.Kumar | 8 Aug 2026 11:25 PM ISTపశ్చిమాసియా రాజకీయాల డ్రామాలో రోజుకో కొత్త కథనం రూపుదిద్దుకుంటోంది. దశాబ్దాలుగా "మా వెనక అమెరికా అంకుల్ ఉన్నాడులే " అని ధీమాగా ఉన్న సౌదీ అరేబియాకు హౌతీల డ్రోన్లు, క్షిపణులు ఊహించని షాక్‌లు ఇచ్చాయి. దాంతో అమెరికా ఇచ్చిన భద్రతా గ్యారెంటీ వల్ల ఉపయోగం లేదని గ్రహించిన సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వెంటనే రూట్ మార్చేశారు. ఈసారి ఏకంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో మక్కాలో ఒక "సూపర్ హిట్" డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నారు.
ఒప్పందం సారాంశం చాలా సింపుల్.. "మా ముగ్గురిలో ఎవరి మీదైనా ఈగ వాలితే అది మిగతా ఇద్దరి మీద దాడి జరిగినట్టే!" అంటే నాటో టైపులో ఒక 'ముగ్గురు మొనగాళ్ళు' గ్యాంగ్‌ను తయారుచేశారన్నమాట.. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది..దాడి జరిగితే సైన్యాన్ని పంపుతారా? లేక కేవలం "అయ్యో పాపం" అని దౌత్యపరమైన సానుభూతి ట్వీట్లు పెట్టి ఊరుకుంటారా? అనేది మాత్రం వారివారి ఇష్టానికే వదిలేశారు.
ఈ కొత్త డ్రామాను చూసి పక్కనే ఉన్న ఇరాన్ గట్టిగానే నవ్వుకుంది. ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు ఎబ్రహీం రెజాయీ నేరుగా స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చేశారు. "అయ్యా సౌదీ రాజా.. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ ఉన్న అమెరికానే నిన్ను కాపాడలేకపోయింది... ఇక అప్పుల కోసం అల్లాడే పాకిస్థాన్.. సొంత ఆర్థిక వ్యవస్థను బాగుచేసుకోలేని టర్కీలు వచ్చి నిన్ను రక్షిస్తాయా? ఈ కాగితపు ఒప్పందాలతో మీ భద్రత పెరగదు.. ఉత్తి భ్రమలు మాత్రమే మిగులుతాయి" అంటూ ఎద్దేవా చేశారు.
ఇక ఈ ఒప్పందాన్ని చూసి మన దగ్గర కూడా కొందరు భారత్-పాక్ కోణంలో లెక్కలు వేస్తున్నారు. రేపు పొరపాటున పాకిస్థాన్‌తో ఘర్షణ వస్తే సౌదీ, టర్కీలు యుద్ధానికి వస్తాయా? అని ఆందోళన చెందుతున్నారు. కానీ అసలు సౌదీకే రక్షణ కావాల్సి వచ్చి ఈ డీల్ చేసుకుంటే వారు వచ్చి పాకిస్థాన్ కోసం పోరాడతారనుకోవడం పగటి కలే అవుతుంది.
ఏది ఏమైనా అమెరికా నీడ నుంచి బయటపడి పాకిస్థాన్, టర్కీల వైపు చూడటం సౌదీకి 'తెలివైన వ్యూహం' అవుతుందో లేక 'కాగితపు పులుల కట్టుకథ'గా మిగిలిపోతుందో కాలమే నిర్ణయించాలి.
