ఎడారి దేశంలో హిమపాతం.. 30 ఎళ్ల తర్వాత సౌదీకి ఏమైంది..!
కానీ... మండుతున్న వేడి, విస్తారమైన ఎడారి వంటి దృశ్యాలకు పర్యాయపదమైన సౌదీ అరేబియాలో ఎవరూ ఊహించని స్థాయిలో హిమపాతం రావడం సంచలనమే!
By: Raja Ch | 22 Dec 2025 4:42 PM ISTయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ)లో ఊహించని శీతాకాల వర్షం.. రోడ్లన్నీ జలమయం.. దక్షిణాసియాలో రికార్డు స్థాయిలో వేడిగాలులు.. సాధారణంగా పొడిగా ఉండే మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో ఆకస్మిక వరదలు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోన్న వేళ.. ఎడారి ప్రాంతంలో అసాధారణ రీతిలో ఏకంగా హిమపాతం కురిసింది. ఇది వైరల్ గా మారింది.
అవును... జమ్మూకశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆదివారం హిమపాతం కురిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొడి చలితో ఇబ్బంది పడుతూ, జల వనరులు ఎండి పోతున్న ఆందోళనలో ఉన్న కశ్మీరీలకు అది శుభవార్త. పైగా ప్రతీ ఏటా ఇది జరిగేదే! కానీ... మండుతున్న వేడి, విస్తారమైన ఎడారి వంటి దృశ్యాలకు పర్యాయపదమైన సౌదీ అరేబియాలో ఎవరూ ఊహించని స్థాయిలో హిమపాతం రావడం సంచలనమే!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తర సౌదీ అరేబియాలో ఆశ్చర్యకరమైన హిమపాతం నమోదైంది. ఇది తబుక్ ప్రావిన్స్ లోని పర్వత శ్రేణుల రూపురేఖలను ఒక్కసారిగా నాటికీయంగా మార్చేసింది. ఇదే సమయంలో సుమారు 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న జెబెల్ అల్ లాజ్ లోని ఎత్తైన ప్రదేశం ట్రోజెనా.. తేలికపాటి వర్షపాతంతో పాటు మంచుతో కప్పబడి ఉంది. హెయిల్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హిమపాతం నమోదైంది.
అదే విధంగా... రియాద్ కు ఉత్తరన ఉన్న అల్ మజ్మా, అల్ ఘాట్ లలో కూడా హిమపాతం కురిసింది. అక్కడ బహిరంగ ప్రదేశాలు, ఎత్తైన ప్రాంతాలలో మంచు స్థిరపడిందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్.సీ.ఎం) తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన ఎన్.సీ.ఎం అధికార ప్రతినిది హుస్సెన్ అల్ ఖహ్తానీ... చల్లని గాలి ద్రవ్యరాశి, వర్షపు మేఘాలతో సంఘర్షణ వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.
ఈ విధంగా ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో మంచుతో కప్పబడిన పర్వతాల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధానంగా అల్ మజ్మా, అల్ ఘాట్ లలో జనాలను ఈ అద్భుత దృశ్యాలు బాగా ఆకర్షించాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో.. రాజధానిలోని అధికారులు ముందుజాగ్రత్త చర్యగా అన్ని స్కూల్స్ ను రిమోట్ లెర్నింగ్ కు మార్చారు.
