బీరాలకు పోయి.. యుద్ధానికి దిగి.. ఇప్పుడు అడుక్కుంటోంది.. పాపం సౌదీ వ్య(క)థ!
డబ్బులుంటే ఏదైనా చేయవచ్చా? ఎంతమందిని అయినా కొనవచ్చా? తమ దగ్గర డబ్బు పలుకుబడితో పొరుగుదేశాలను అణచివేయవచ్చు అని భ్రమ పడిన సౌదీ అరేబియాకు ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
By: A.N.Kumar | 28 Oct 2026 12:05 PM ISTడబ్బులుంటే ఏదైనా చేయవచ్చా? ఎంతమందిని అయినా కొనవచ్చా? తమ దగ్గర డబ్బు పలుకుబడితో పొరుగుదేశాలను అణచివేయవచ్చు అని భ్రమ పడిన సౌదీ అరేబియాకు ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎరక్కపోయి అమెరికా అండతో ఇరాన్ పైకి దూసుకెళ్లిన సౌదీ అరేబియా.. ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడి చమురు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సహా సైనిక స్థావరాలను కోల్పోయి నానా అగచాట్లు పడింది. చివరకు అమెరికా ను కాదని టర్కీ, పాక్ తో కలిసి రక్షణ ఒప్పందం చేసుకుంది. అలాగే ఇరాన్ ను శరణుజొచ్చి ఆ దేశంతోనూ సంధి చేసుకుంది.
సౌదీ చేసిన పొరపాటు కేవలం ఇరాన్ విషయంలోనే కాదు.. తన పక్క దేశం యెమెన్ లోనూ తలదూర్చి చేతులు కాల్చుకుంది. యెమెన్ లోని తిరుగుబాటుదారులు ‘హౌతీ’లను అణిచివేయడానికి ప్రయత్నించడం.. వారు ప్రతి దాడులతో విరుచుకుపడడం.. టర్కీ, పాక్ లు సాయంగా రాకపోవడంతో ఇప్పుడు సౌదీ బాధలు అన్నీ ఇన్నీ కావు. సౌదీలోని కీలకమైన వైమానిక స్థావరాలు సహా చమురు క్షేత్రాలు, తీర పట్టణాలను హౌతీల దాడుల్లో కకావికలమవుతున్నాయి. దీంతో ఏమీ చేయాలో పాలుపోక సౌదీకి మరోసారి అగచాట్లు ఏర్పడుతున్నాయి.
బిలియన్ డాలర్లతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను టర్కీ, పాక్ అమలు చేయకుండా తమ సైన్యాలను పంపకపోవడంతో హౌతీలను ఎదుర్కోవడం సౌదీకి తలకు మించిన భారమవుతోంది. దీంతో దీర్ఘకాల యుద్ధాన్ని చేయలేక హౌతీలతోనూ సంధి చేసుకునేందుకు ‘సౌదీ’ ఓ బంపర్ ఆఫర్ ను ఇచ్చేసింది.
హౌతీలు దాడులతో విరుచుకుపడుతున్న వేళ సౌదీ అరేబియా తాజాగా సీజ్ ఫైర్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. సౌదీ తరుఫున హౌతీలపై యుద్ధం చేయలేని ఇదే తుర్కియే, పాకిస్తాన్ లు ఇరాన్ తో కలిసి హౌతీలతో మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.
హౌతీలను సౌదీ కోరేది ఒక్కటే.. ‘సౌదీ’పై దాడులు ఆపడమే కాక ఆయిల్ ఎగుమతులకు హౌతీలు అడ్డుపడొద్దన్నది సౌదీ ప్రతిపాదన.. ఇందులో భాగంగా సౌదీ 1 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొనడంతో పెద్ద సంచలనమైంది.
దీంతో హౌతీల దెబ్బకు ముక్కు మొహం వాచి.. వారితో నేరుగా తలపడలేక సౌదీ చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది. చివరకు హౌతీలతోనూ కాళ్ల బేరానికి సిద్ధమవ్వడం.. తమ వద్ద పేరుకున్న ఆపారమైన డబ్బుతోనే హౌతీలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. మరి సౌదీ డబ్బుకు హౌతీలు బెండ్ అవుతారా? యుద్ధాన్ని ముగిస్తారా? పగ ప్రతీకారంతో సౌదీని వెంటాడుతారా? అన్నది చర్చల తర్వాత తేలనుంది.
