ముద్దు పెట్టుకున్నందుకు మక్కాలో సౌదీ జంటకు ఉరిశిక్ష?
సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలో బంగ్లాదేశీ జంటకు మరణశిక్ష విధించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాలు, అంతర్జాతీయ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
By: A.N.Kumar | 21 Oct 2026 10:30 AM ISTసౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలో బంగ్లాదేశీ జంటకు మరణశిక్ష విధించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాలు, అంతర్జాతీయ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. మక్కాలోని ఒక మసీదులో ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలపై నజ్రుల్ ఇస్లామ్ అబ్దుల్ బషీర్, సితి అక్తర్ అనే ఇద్దరికి ఈ కఠిన ఉరి శిక్ష విధించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే వారు కేవలం నుదుటిపై ముద్దు పెట్టుకున్నందుకే ఉరిశిక్ష విధించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాలేంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఏం జరిగింది?
నివేదికల ప్రకారం.. మక్కాలోని ఓ పవిత్ర మసీదు ప్రాంగణంలో ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్‌కు చెందిన ఈ జంటపై కేసులు నమోదయ్యాయి. విచారణ అనంతరం స్థానిక న్యాయస్థానం వారికి మరణశిక్ష విధించగా.. ఉన్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న వీరిద్దరికీ శిక్ష అమలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
అయితే నిందితులు ఏం చేశారనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, తీర్పు ప్రతులు బహిరంగంగా వెల్లడి కాకపోవడంతో సోషల్ మీడియాలో భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా వీరు కేవలం ముద్దు పెట్టుకున్నారనే ప్రచారానికి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు.
సౌదీ చట్టాలు ఎలా ఉంటాయంటే?
కేవలం నుదుటిపై ముద్దు పెట్టుకున్నందుకే మరణశిక్ష విధించారనే వార్త తీవ్ర దుమారం రేపింది. సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటన ప్రకారం.. ఈ కేసులో న్యాయస్థానం ‘తాజిర్’ విధానం కింద శిక్ష ఖరారు చేసింది. ఇస్లామిక్ న్యాయవ్యవస్థలో నేరం జరిగిన ప్రదేశం, దాని తీవ్రత, మసీదు పవిత్రతను ఉల్లంఘించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తి శిక్షను నిర్ణయిస్తారు. అయితే నిందితులపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏమిటనే దానిపై స్పష్టమైన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
బంగ్లాదేశ్ దౌత్యపరమైన వ్యూహం
ఈ మరణశిక్షల అమలుపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శిక్ష అమలుకు ముందు తమకు ఎలాంటి సమాచారం అందించలేదని జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ జనరల్ తెలిపింది. "ఈ వ్యవహారంపై అధికారిక వివరణ కోరుతూ సౌదీ విదేశాంగ శాఖకు దౌత్యపరమైన లేఖ పంపాం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన విచారణ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని కోరాం." అని బంగ్లాదేశ్ దౌత్య వర్గాలు తెలిపాయి.
వలస కార్మికుల హక్కులపై లేస్తున్న ప్రశ్నలు
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వలస కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. భాషా సమస్యలు, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం.. సరైన ఉచిత న్యాయ సహాయం అందకపోవడం వంటి ప్రతిబంధకాలు నిందితులకు ప్రతికూలంగా మారుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
మక్కాలోని మసీదు పవిత్రతను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష పడిన మాట వాస్తవమే అయినప్పటికీ.. కేవలం 'ముద్దు పెట్టుకున్నందుకే' ఉరితీశారనే ప్రచారానికి ఎలాంటి అధికారిక లేదా విశ్వసనీయ ఆధారాలు లేవు. కోర్టు తీర్పులోని పూర్తి వివరాలు బయటకు వస్తేనే ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
