Begin typing your search above and press return to search.

తిరుపతి జిల్లాకు మరో మెగా ఆఫర్: 250 ఎకరాల్లో 'హెయిర్' మానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ!

ఇప్పుడు సత్యవేడులో హెయిర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం తయారీ రంగం హబ్ గా మారనుందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   19 Oct 2026 1:21 PM IST
తిరుపతి జిల్లాకు మరో మెగా ఆఫర్: 250 ఎకరాల్లో హెయిర్ మానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ!
X

ప్రముఖ గృహోపకరణాల సంస్థ (హోం అప్లయెన్సెస్) తయారీ దిగ్గజం 'హెయిర్' రాష్ట్రంలో తన కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా సత్యవేడులో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో రూ.7,000 కోట్ల భారీ పెట్టుబడితో అత్యాధునిక మానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ ఆర్థిక పత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ వెల్లడించింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో పెట్టుబడుల ఆకర్షణకు తగిన వాతావరణం కల్పించడంతో హెయిర్ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో పలు ఎలక్ట్రానిక్స్ సంస్థలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఇప్పుడు సత్యవేడులో హెయిర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం తయారీ రంగం హబ్ గా మారనుందని అంటున్నారు.

సత్యవేడులో ప్రతిపాదిత ప్లాంటును రెండు దశలుగా పూర్తి చేయాలని హెయిర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.2,500 కోట్లతో 2032 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోందని సమాచారం. ప్లాంట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 6,000 మందికి, పరోక్షంగా మరో 15,000 మందికి.. మొత్తంగా దాదాపు 21,000 మందికి ఉపాధి లభించనుందని అంచనా వేస్తున్నారు. తిరుపతి-చెన్నై-నెల్లూరు ఎలక్ట్రానిక్స్ కారిడార్‌ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌లో ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ ఇతర చిన్న గృహోపకరణాలను భారీ ఎత్తున తయారు చేయనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న హెయిర్ సంస్థకు దేశంలో ఇప్పటికే మహారాష్ట్రలోని పూణే (రంజన్‌గావ్), ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతాలలో రెండు ప్రధాన తయారీ యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని సత్యవేడులో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ హెయిర్ సంస్థకు దేశంలో మూడోది కావడం విశేషం. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో కంపెనీకి ఇదే మొట్టమొదటి అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కానుంది.

గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాలకు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే ప్రముఖ సంస్థ ఎల్‌జీ ఏపీలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తుండగా, శ్రీసిటీలో తన తయారీ పనులను మరింత విస్తరిస్తోంది. ఇప్పుడు తాజాగా 'హెయిర్' సంస్థ కూడా రూ.7 వేల కోట్ల భారీ పెట్టుబడితో సత్యవేడును ఎంచుకోవడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోందని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనున్నాయి.