Begin typing your search above and press return to search.

మంత్రిగా ఓకే.. ఎమ్మెల్యేగా ఫెయిల్ అవుతున్నారా ...?

నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. మంత్రిగా, పార్టీ కీల‌క నాయ‌కుడిగా ఉండ‌డంతో స‌త్య‌కుమార్ నియోజకవ‌ర్గానికి స‌మ‌యం కేటాయించ‌లేకపోతున్నారు.

By:  Garuda Media   |   30 Jun 2026 8:00 PM IST
మంత్రిగా ఓకే.. ఎమ్మెల్యేగా ఫెయిల్ అవుతున్నారా ...?
X

మంత్రిగా ఆయ‌న‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. త‌న శాఖ‌పైనా ప‌ట్టు పెంచుకున్నారు. చిన్న చిన్న స‌మ‌స్య‌లు తప్పిస్తే.. ఆదిలో ఉన్నంత విమ‌ర్శ‌లు కూడా ఇప్పుడు రావ‌డం లేదు. మంత్రిపై అంచ‌నాలు కూడా పెరుగుతున్నాయి. ఇక‌, పార్టీ ప‌రంగాకూడా ఆయ‌న కు ఎలాంటి ఇబ్బందీ లేదు. పై నుంచి కింది స్థాయి వ‌ర‌కు కూడా అంద‌రితోనూ క‌లివిడిగానే ఉంటున్నారు. కానీ, తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయి.

ఆయ‌నే వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత స‌త్య‌కుమార్ యాద‌వ్‌. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి ఈ సీటును టీడీపీ యువ నాయ‌కుడు ఒక‌రు ఆశించారు. కానీ, బీజేపీ అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న స‌త్య‌కుమార్‌.. చివ‌రి నిమిషంలో దీనిని ద‌క్కించుకుని గెలుపు గుర్రం ఎక్కారు. ఆ త‌ర్వాత మంత్రిగా ప‌ద‌విని కూడా సొంతం చేసుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. మంత్రిగా, పార్టీ కీల‌క నాయ‌కుడిగా ఉండ‌డంతో స‌త్య‌కుమార్ నియోజకవ‌ర్గానికి స‌మ‌యం కేటాయించ‌లేకపోతున్నారు. ఇది అంద‌రు మంత్రులూ చేస్తున్న ప‌నే. ఈ క్ర‌మంలో నే న‌లుగురు పీఏల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో నియ‌మించి.. బాధ్య‌త‌లు అప్ప‌గించారు. వారితోనే ఇప్పుడు మంత్రికి సెగ త‌గులుతోంద‌ని అంటున్నారు. పీఏల‌కు.. పార్టీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగు తున్నాయి. నాయ‌కులు కోరుతున్న‌ట్టుగా పీఏలు ప‌నిచేయ‌డం లేదు.

పోనీ.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏమైనా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయా ? అంటే.. అవి కూడా లేవు. మ‌రి పీఏలు ఏం చేస్తున్నారు ? అంటే.. మంత్రి త‌ర‌ఫున ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. కార్యాల‌యాల్లో సేద దీరుతున్నార‌ని బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాలు మంత్రిని నియోజ‌క‌వ‌ర్గంలో సొంత నేత‌ల నుంచే వ్య‌తిరేక‌త‌ను పెంచుతున్నాయి.