Begin typing your search above and press return to search.

టీడీపీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ హ‌వా.. రీజ‌నేంటి ..!

ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు.

By:  Garuda Media   |   31 July 2025 4:00 AM IST
టీడీపీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ హ‌వా.. రీజ‌నేంటి ..!
X

టిడిపి నియోజకవర్గంలో వైసిపి హవా కొనసాగుతున్న పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి అధికార పార్టీ నాయకులు.. ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఆదిపత్యం సాధించిన పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉంటే.. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసిపి నేతల హవా కనిపిస్తోందిజ‌ ఇది చిత్రమే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మాత్రం వాస్తవమని చెప్పక తప్పదు. ఇటువంటి నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ముందు వరసలో ఉంది.

ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. టిడిపి తరఫున పోటీ చేసిన ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. ఇక టిడిపి అధికారంలోకి వచ్చింది. దీంతో సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణ హవా కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. సాధారణంగా అదే జరగాలి కూడా. కానీ చిత్రం ఏంటంటే గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోతే ఓడిపోయిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం నియోజకవర్గంలో చలరేగుతున్నారన్నది రాజకీయంగా జరుగుతున్న చర్చ.

సాధారణంగా ఇతర నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇటువంటి వాతావరణం ఎక్కడ కనిపించదు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల దూకుడు మనకు కనిపిస్తుంది. కానీ, సత్తెనపల్లిలో మాత్రం చాలా సీనియర్ నాయకుడిగా పేరున్నప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ మౌనంగా ఉండడంతో అంబటి రాంబాబు రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలీసులపై, అదేవిధంగా ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శలు గుప్పిస్తున్నారు. రెంటపాళ్లకు జగన్ వచ్చినప్పుడు అదేవిధంగా తెనాలిలో పర్యటించినప్పుడు కూడా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ అంబటి రాంబాబు విమర్శలు చేశారు.

ప్రభుత్వం పై నిశితంగా వ్యాఖ్యలు సంధించారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తారు. ప్రత్యర్థి పక్షానికి కాక‌రేగేలాగా వ్యవహరిస్తారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. నాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. గత ఎన్నికల ముందు టిడిపిలోకి వచ్చిన కన్నా మంత్రివర్గంలో సీటును ఆశించారు. అయితే సామాజిక వర్గ సమీకరణలతో పాటు మిత్ర పక్షాలను సంతృప్తి పరిచే ఉద్దేశంతో ఆశించిన వారికి మంత్రి పదవులు అయితే లభించని మాట వాస్తవం.

అయితే ఇదే ప్రామాణికంగా తీసుకున్నారో లేక అంతర్గతంగా మరిన్ని వివాదాలు ఉన్నాయో తెలియదు గానీ కన్నా మాత్రం సైలెంట్ అయిపోయారు. ఏం జరిగినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రెంటపాళ్ల ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు గుప్పించినా స్థానిక ఎమ్మెల్యేగా కన్నా మాత్రం ఏదో పైపైకి వ్యాఖ్యలు చేసి మళ్లీ సైలెంట్ అయిపోయారు. మొత్తంగా ఎమ్మెల్యే తీరు కారణంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసిపిదే పై చేయి అన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఇదే పద్ధతి కొనసాగితే ముందు ముందు వ్యక్తిగతంగా కన్నా కంటే కూడా టిడిపికి నష్టం జరిగే అవకాశం ఉందని అంతర్గతంగా నాయకులు భావిస్తున్నారు.