Begin typing your search above and press return to search.

బీహార్ లో అయిదు రోజుల సీఎంగా రికార్డు

ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజేవరో మంత్రి ఎవరో నవంబర్ 14న తేలిపోతుంది.

By:  Satya P   |   23 Oct 2025 4:00 AM IST
బీహార్ లో అయిదు రోజుల సీఎంగా రికార్డు
X

ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజేవరో మంత్రి ఎవరో నవంబర్ 14న తేలిపోతుంది. అయితే బీహార్ వంటి పెద్ద రాష్ట్రం హిందీ భారతాన కీలక రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడూ ఆసక్తిగానే సాగుతాయి. ప్రతీ ఎన్నికకూ విశేషం ఉంటుంది. అంతే కాదు జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే సత్తా బీహార్ కి ఉంటుంది. బీహార్ లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎందరో ముఖ్యమంత్రులు పనిచేశారు ఇప్పటిదాకా బీహార్ కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత నితీష్ కుమార్ కి దక్కుతుంది. మరి అత్యల్ప కాలం సీఎం గా పనిచేసింది ఎవరో కూడా చూడాలి కదా. అలా చెప్పుకుంటే కేవలం అయిదు అంటే అయిదు రోజుల పాటు సీఎంగా పనిచేసిన వారుగా ఒకాయన రికార్డు క్రియేట్ చేశారు.

అన్నీ మొదటి సారే :

తొలి ఓబీసీగా తొలిసారి ఎమ్మెల్యే అయి తొలిసారి సీఎం అయిన నేతగా ఆయన తనదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయనే సతీష్ ప్రసాద్ సింగ్. ఆయన భూస్వామి కుటుంబంలో జన్మించినా సోషలిస్ట్ భావాలతో ముందుకు సాగారు. ఆయన 1962లో తొలిసారి పర్బట్టా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 1964లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. అపుడు పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు సింగ్. అయితే 1967లో ముచ్చటగా మూడవసారి రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలోని సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

సంకీర్ణ సర్కార్ కూలింది :

ఇక ఆ ఎన్నికల్లో జనసంఘ్, కమ్యూనిస్టులు సోషలిస్టులు అంతా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక జన క్రాంతి దళ్ కి చెందిన మహామయ ప్రసాద్ సీఎం అయ్యారు. కానీ ఈ సంకీర్ణంలో విభేదాలు వల్ల కూటమి కుప్ప కూలింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ కూటమిలో చిచ్చు రేపింది. అంతే సంయుక్త సోషలిస్ట్ పార్టీ విడిపోయింది. దాంతో అందులో నుంచి బయటకు వచ్చిన సతీష్ ప్రసాద్ సింగ్ కి మరో నేత బీసీ మండల్ మద్దతు ఇవ్వడం వీరి వద్ద కొంతమంది ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్ మద్దతుతో 1968 జనవరి 28న సతీష్ ప్రసాద్ సింగ్ సీఎం అయిపోయారు. అయితే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బీపీ మండల్ కి సతీష్ ప్రసాద్ సింగ్ కి మధ్య విభేదాలు పొడసూపడంతో ఆయన ఫిబ్రవరి 1న తన పదవికి రాజీనామా చేశారు. ఆ మీదట బీపీ మండల్ కొత్త సీఎం అయ్యారు కేవలం అయిదంటే అయిదు రోజులు మాత్రమే సీఎం గా చేసిన సతీష్ ప్రసాద్ సింగ్ ఆ తరువాత పెద్దగా అవకాశాలు అయితే బీహార్ రాజకీయాల్లో అందుకోలేదు. ఆయన 87 వయసులో 2020లో ఢిల్లీలో కన్ను మూశారు. మొత్తానికి చూస్తే కనుక బీహార్ లో అయిదు రోజుల సీఎం గా సింగ్ సరికొత్త చరిత్రనే సృష్టించారు.

ఏడు రోజుల సీఎం గా నితీష్ :

బీహార్ లో మరో విశేషం కూడా ఉంది. వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా తొలిసారి బీహార్ కి నితీష్ కుమార్ సీఎం అయ్యారు. నితీష్ కుమార్ అంటే వాజ్ పేయ్ కి ఇష్టం అయితే ఆయన తొలిసారి 2000 మార్చి 3 నుంచి అదే నెల 10 వరకూ కేవలం వారం రోజులు మాత్రమే సీఎం గా పనిచేశారు. మెజారిటీకి సరిపడా బలం లేకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే 2005 నుంచి మాత్రం ఆయన తిరుగులేని విధంగా అధికారం చలాయిస్తూ వస్తున్నారు.