Begin typing your search above and press return to search.

చిన్నారుల కోసం పెద్ద హృదయం… ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ ఇనిషియేటివ్ హైలైట్!

శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి నిరుపేద కుటుంబాల్లోని గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల పాలిట ఒక దేవాలయంగా మారింది.

By:  Madhu Reddy   |   4 July 2026 4:50 PM IST
చిన్నారుల కోసం పెద్ద హృదయం… ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ ఇనిషియేటివ్ హైలైట్!
X

సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ హాస్పిటల్‌లో ఒక అద్భుతమైన మానవీయ వేడుక జరిగింది. నిరుపేద చిన్నారులకు ఏకంగా 500 ఉచిత గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై, చిన్నారులతో సరదాగా గడుపుతూ అందరిలోనూ కొండంత ధైర్యాన్ని నింపారు.

కొండపాకలో 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' వేడుక:

శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి నిరుపేద కుటుంబాల్లోని గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల పాలిట ఒక దేవాలయంగా మారింది. రూపాయి ఖర్చు లేకుండా 500 మంది చిన్న పిల్లలకు గుండె సర్జరీలు పూర్తి చేయడం ఒక పెద్ద రికార్డు. ఈ మైల్‌స్టోన్‌ను సెలబ్రేట్ చేయడానికి నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌లో హరీష్ రావు, విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఇద్దరూ కలిసి హాస్పిటల్ అంతా తిరిగి రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పిల్లల పెయింటింగ్‌కు ఫిదా:

హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న చిన్నారులతో హరీష్ రావు, విజయ్ దేవరకొండ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. ఈ క్రమంలో ఒక చిన్నారి స్వయంగా వేసిన అందమైన పెయింటింగ్‌ను చూసి వీరిద్దరూ ఫిదా అయిపోయారు. ఆ పాప టాలెంట్‌ను మెచ్చుకుంటూ స్పెషల్‌గా అభినందించారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న వారి హృదయాలను హత్తుకున్నాయి.

సర్టిఫికెట్ల అందజేత:

ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా కోలుకున్న చిన్నారులకు హరీష్ రావు, విజయ్ దేవరకొండ చేతుల మీదుగా "గిఫ్ట్ ఆఫ్ లైఫ్" సర్టిఫికెట్లను, బహుమతులను అందజేశారు. మళ్లీ కొత్త జీవితాన్ని పొందిన ఆ పిల్లల ముఖాల్లోని ఆనందం, వారి తల్లిదండ్రుల కళ్లలోని కృతజ్ఞతా భావం చూసి అతిథులు సైతం ఎమోషనల్ అయ్యారు.

సత్యసాయి ట్రస్ట్‌పై ప్రశంసల జల్లు:

ఈ సందర్భంగా హరీష్ రావు మరియు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో గొప్ప సేవ చేస్తున్న శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌ను, డాక్టర్ల బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరుపేద పిల్లలకు ఉచితంగా ప్రాణదానం చేయడం దేవుడి సేవతో సమానమని వారు కొనియాడారు. భవిష్యత్తులో ఈ హాస్పిటల్‌కు తమ వంతు సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని హరీష్ రావు తెలిపారు. ఇక విజయ్ మాట్లాడుతూ..ఓ వ్యక్తి నిర్ణయం వల్ల ఎన్నో గొప్ప పనులు జరుగుతాయి. 'నేను సత్య సాయి బాబ గారి మొదలు పెట్టిన స్కూల్ లో చదువుకున్నాను ,అందుకే ఇంత స్థాయి లో వున్నాను అని ,ఇలా హెల్ప్ చేయటం ఇంతోమందికి సహాయం చేయటం గొప్ప కార్యక్రం' అని తమ వంతు సహాయం ఉంటుందని తెలిపారు.

రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉండే హరీష్ రావు, సినిమాలతో బిజీగా ఉండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇలా ఒక మంచి కాజ్ కోసం కలిసి రావడం నిజంగా అభినందనీయం. వీరి రాకతో హాస్పిటల్‌లో ఉన్న చిన్నారులకు, వారి కుటుంబాలకు ఎంతో మానసిక ధైర్యం లభించింది. ఇక 500 గుండె ఆపరేషన్లు పూర్తి చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ సంస్థ మున్ముందు మరెంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం..