Begin typing your search above and press return to search.

సంచలన తీర్పు : తండ్రీకొడుకుల లాకప్ డెత్ : 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

చట్టాన్ని కాపాడాల్సిన చేతులే కాలయముళ్లైతే.. న్యాయదేవత కళ్ళు కప్పదు.. కఠినంగా స్పందిస్తుందని మదురై కోర్టు నిరూపించింది.

By:  A.N.Kumar   |   6 April 2026 9:11 PM IST
సంచలన తీర్పు : తండ్రీకొడుకుల లాకప్ డెత్ : 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
X

చట్టాన్ని కాపాడాల్సిన చేతులే కాలయముళ్లైతే.. న్యాయదేవత కళ్ళు కప్పదు.. కఠినంగా స్పందిస్తుందని మదురై కోర్టు నిరూపించింది. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సాతాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. జయరాజ్, బెన్నిక్స్‌లను చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసిన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఖాకీ ముసుగులో జరిగిన ఈ అమానుష కాండను 'అరుదైన వాటిలోకెల్లా అరుదైన నేరం'గా పరిగణించిన ధర్మాసనం, బాధితుల కుటుంబానికి నాలుగేళ్ల తర్వాత ఊరటనిచ్చే తీర్పునిచ్చింది.

తమిళనాడులో దేశవ్యాప్తంగా ఆగ్రహం రేకెత్తించిన సాతాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 2020లో జరిగిన ఈ దారుణ ఘటనపై సుదీర్ఘ విచారణ అనంతరం.. తొమ్మిది మంది పోలీసులను కోర్టు దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ఈ నేరాన్ని అధికార దుర్వినియోగం, క్రూరత్వం అతి తీవ్ర స్థాయిలో ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

–కేసు నేపథ్యం ఇదీ

తూతుకుడి జిల్లా సాతాంకుళానికి చెందిన వ్యాపారి జయరాజ్ , అతని కుమారుడు బెన్నిక్స్‌ను 2020 జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ షాప్ తెరిచారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్‌లో వారిపై తీవ్ర హింస జరిగిందని, రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారని దర్యాప్తులో తేలింది. ఈ దాడుల ఫలితంగానే ఇద్దరూ తీవ్ర గాయాలతో జూన్ 22 , 23 తేదీల్లో కోవిల్‌పట్టి సబ్ జైల్లో మరణించారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అనంతరం కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. దర్యాప్తులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. లాకప్ గోడలు, లాఠీలు, పోలీస్ స్టేషన్‌లోని పలు ప్రదేశాల నుంచి సేకరించిన రక్త నమూనాలు బాధితుల డీఎన్ఏతో సరిపోలినట్లు ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా నేరాన్ని కప్పిపుచ్చేందుకు సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం వంటి ప్రయత్నాలు కూడా జరిగినట్లు బయటపడింది.

ఈ కేసులో ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. తండ్రీకొడుకులపై జరిగిన హింసను ఆమె వివరంగా వెల్లడించింది. స్టేషన్‌లోని బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని.. సీసీటీవీ ఫుటేజీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్టింగ్‌లు మార్చినట్లు కూడా దర్యాప్తులో తేలింది.

విచారణలో ఇన్‌స్పెక్టర్ ఎస్. శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సమదురై, కానిస్టేబుళ్లు ముత్తురాజ్, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు దోషులుగా తేలారు. మరో నిందితుడు పాల్దురై విచారణ సమయంలో కోవిడ్ కారణంగా మరణించాడు.

సీబీఐ వాదనలు పరిశీలించిన కోర్టు, ఈ హింస ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని, అత్యంత అమానుషంగా కొనసాగించారని పేర్కొంది. బాధితులపై జరిగిన దాడి తీవ్రత, సాక్ష్యాల ధ్వంసం, అధికార దుర్వినియోగం అన్నింటిని పరిగణనలోకి తీసుకుని గరిష్ట శిక్ష విధించింది.

ఈ తీర్పు దేశవ్యాప్తంగా కస్టడీ హింసపై ఒక గట్టి సందేశంగా భావిస్తున్నారు. న్యాయవ్యవస్థ బాధితులకు న్యాయం చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన వారు కావడంతో ఇలాంటి ఘటనలు మరింత కఠినంగా ఎదుర్కొవాలని నిపుణులు సూచిస్తున్నారు.