ఇండియాలోనే ఫస్ట్ టైం.. అమరావతిలో శాటిలైట్‌తో హెలికాప్టర్ ల్యాండింగ్
శాటిలైట్ సహాయంతో హెలిపోర్ట్ ల్యాండింగ్ సాంకేతికత అభివృద్ది చేశారు. భారతదేశంలోనే ఫస్ట్ శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్ ల్యాండింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి హెలిపోర్ట్‌లో ప్రారంభించారు.
By: Ramesh Palla | 4 July 2026 12:32 PM ISTభారీ వర్షం పడుతున్నప్పుడు, లైటింగ్ సరిగ్గా లేని సమయంలో, వాతావరణం అనుకూలించని సమయంలో హెలికాప్టర్‌లను ల్యాండ్ చేయడం చాలా కష్టం. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ ప్రయాణాలు రద్దు కావడం కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా రక్షించేందుకు ప్రయత్నించిన సమయంలో వాతావరణ అనుకూలించడం లేదు అంటూ వార్తలు వింటూ ఉంటాం. ఇకపై అలాంటి వార్తలు వినబోము... ఎందుకంటే ఎలాంటి వాతావరణంలో అయినా, అర్థ రాత్రి సమయంలో అయినా హెలికాప్టర్‌లు ల్యాండ్ అయ్యేందుకు కొత్త టెక్నాలజీని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఇటీవలే ఈ సాంకేతి పరిజ్ఞానంకు డీజీసీఏ అనుమతులు రావడంతో అమరావతిలో టెస్ట్ రన్ నడిచింది.
అమరావతిలో ఫస్ట్ హెలిపోర్ట్ ల్యాండింగ్ టెక్నాలజీ...
శాటిలైట్ సహాయంతో హెలిపోర్ట్ ల్యాండింగ్ సాంకేతికత అభివృద్ది చేశారు. భారతదేశంలోనే ఫస్ట్ శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్ ల్యాండింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి హెలిపోర్ట్‌లో ప్రారంభించారు. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ అత్యాధునిక విధానానికి ఆమోదం తెలపడంతో ఇక ముందు సమయం తో సంబంధం లేకుండా, వాతావరణ ఇబ్బందులు లేకుండా ఈజీగానే హెలికాప్టర్‌లు నూటికి నూరు శాతం సురక్షితంగా ల్యాండ్ కాబోతున్నాయి. దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శాటిలైట్ సాయంతో భూమి పై ఉన్న హెలిపాడ్ కి హెలికాప్టర్ చేరుకునే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ను తయారు చేయడం జరిగింది. నావిగేషన్ సహాయంతో హెలికాప్టర్ ను సురక్షితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పైలెట్ హెలికాప్టర్‌ను ల్యాంగ్ చేయవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు.
సిగ్నలింగ్ లేకుండా హెలికాప్టర్ ల్యాండింగ్...
ఇప్పటి వరకు హెలికాప్టర్ ల్యాండింగ్‌కు భూమి మీద ఖరీదైన సిగ్నలింగ్ వ్యవస్థలు అవసరం అయ్యేవి. అయితే ఇప్పుడు ఆ సిగ్నలింగ్ వ్యవస్థలు అవసరం లేకుండా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ ఇచ్చే డేటా ఆధారంగానే హెలికాప్టర్‌లు ల్యాండ్ కావచ్చు. అది కూడా అత్యంత సురక్షితంగా అని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా హెలికాప్టర్ ప్రయాణం కేవలం డే టైమ్‌లోనే, అది కూడా వాతావరణం అనుకూలిస్తేనే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్ ల్యాండింగ్ సాంకేతికతతో 24/7 హెలికాప్టర్‌ల ప్రయాణం సాగించవచ్చని అధికారులు అంటున్నారు. భారతదేశంలోనే మొదటి సారి ఈ సాంకేతిక పరిజ్ఞానం ను అమరావతిలోని ఉండవల్లి ప్రాంతంలో పరీక్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక గుర్తింపు లభించినట్లు అయిందని స్థానికులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతిలోని ఉండవల్లికి అరుదైన గౌరవం...
ఉండవల్లి హెలిపోర్ట్ ప్రారంభించిన అనంతరం అధికారులు మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, రోడ్డు మార్గం ద్వారా చేరుకోలేని, కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఈజీగా చేరుకుని, అక్కడ చిక్కుకున్న వారిని రక్షించే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు, అత్యవసర ప్రయాణాలకు ఇది అత్యంత ఉపయోగదాయకంగా వారు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ సాంకేతికతను విస్తరించబోతున్నట్లుగా విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భవిష్యత్తులో విమానయాన రంగంలో ఈ సాంకేతికత కారణంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. అమరావతి వంటి ప్రాంతంలో ఈ కొత్త ఆవిష్కరణ ను ప్రారంభించడం ద్వారా ప్రపంచం దృష్టిని అమరావతిపై పడేలా చేశారంటూ పరిశీలకులు అంటున్నారు.
