అరచేతిపై డాక్టర్ సూసైడ్ నోట్.. ఎస్సై అత్యాచారంతోనే ఆత్మహత్య
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకున్న ఓ వైద్యురాలి ఆత్మహత్య ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
By: A.N.Kumar | 24 Oct 2025 5:30 PM ISTమహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటుచేసుకున్న ఓ వైద్యురాలి ఆత్మహత్య ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. తనపై ఎస్సై అత్యాచారం చేశాడంటూ, ఆ నొప్పిని తట్టుకోలేక చివరికి ప్రాణాలు తీసుకున్న ఆమె అరచేతిపై రాసిన సూసైడ్ నోట్ మనసును కలచేస్తోంది.
బీద్ జిల్లాకు చెందిన ఓ యువ వైద్యురాలు సతారాలోని ఫల్టాన్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఫల్టాన్‌లోని ఓ హోటల్‌లో ఉరేసుకొని మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా ఆమె అరచేతిపై “నా చావుకు SI గోపాల్ కారణం. గత ఐదు నెలలుగా నాలుగు సార్లు రేప్ చేశాడు. ఫిజికల్‌గా, మెంటల్‌గా నన్ను వేధిస్తున్నాడు” అని రాసి ఉందని గుర్తించారు.
ముందే ఫిర్యాదు చేసినా చర్యలు లేవు
మృతురాలు మూడు నెలల క్రితం సతారా డీఎస్పీకి లేఖ రాసి, ఎస్సై గోపాల్ బదానేతో పాటు మరో పోలీస్ ప్రశాంత్ బంకర్ తనను వేధిస్తున్నారని స్పష్టంగా వివరించినట్లు సమాచారం. అయితే, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరాశ చెందిన ఆమె చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బంధువుల ఆరోపణలు
మృతురాలి బంధువులు మాట్లాడుతూ ఆమెను పోలీసులు, ఉన్నతాధికారులు నకిలీ వైద్య నివేదికలు ఇవ్వమని ఒత్తిడి చేసేవారని, రోగులు లేకపోయినా ఫిట్‌నెస్ రిపోర్టులు ఇవ్వాలని బలవంతం చేసారని పేర్కొన్నారు. ఆమె నిరాకరించడంతో మానసికంగా వేధింపులు మరింత పెరిగాయని చెప్పారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేపింది. మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ తక్షణమే విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతారా ఎస్పీతో మాట్లాడి, ఎస్సై గోపాల్ బదానే, ప్రశాంత్ బంకర్‌లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
* వైద్య వర్గాల్లో ఆందోళన
ఒక మహిళా వైద్యురాలు, అదే వ్యవస్థలో పనిచేసే పోలీసుల చేతిలో వేధింపులు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకోవడం వైద్య వర్గాల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. “న్యాయం కోసం కేకలు వేయడమే ఆమె తప్పా?” అనే ప్రశ్నతో సామాజిక వేదికల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
సమాజానికి సందేశం
ఈ ఘటన మహిళా భద్రతపై మరోసారి ఆలోచింపజేస్తోంది. శిక్ష భయం లేకపోవడం, ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వంటి అంశాలు నిర్దోషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. దర్యాప్తు పారదర్శకంగా జరిగి, నిందితులకు కఠిన శిక్షలు విధిస్తేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
