Begin typing your search above and press return to search.

చెప్పినట్లే ‘అమ్మ’ నెచ్చలి రాజకీయ పార్టీ పెట్టేశారు

మరి కొద్దినెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. ఈసారి ఎన్నికల్లో తమ లక్ ను పరీక్షించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు.

By:  Garuda Media   |   13 March 2026 9:00 PM IST
చెప్పినట్లే ‘అమ్మ’ నెచ్చలి రాజకీయ పార్టీ పెట్టేశారు
X

మరి కొద్దినెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. ఈసారి ఎన్నికల్లో తమ లక్ ను పరీక్షించుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో విజయ్ రాజకీయపార్టీ పెట్టి.. తన ప్రభావాన్ని చూపించాలని తపించటం.. ఇటీవల కాలంలో ఆయనకు తగులుతున్న ఎదురుదెబ్బల సంగతి తెలిసిందే. ఇదంతా తరచూ హాట్ టాపిక్ గా మారుతున్న వేళ.. అనూహ్యంగా రాజకీయ తెర మీదకు వచ్చారు తమిళనాడు అమ్మగా కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న జయలలిత నెచ్చలి శశికళ. అన్నాడీఎంకే బహిష్క్రత నేతగా పలు ఎదురుదెబ్బలు తినటమేకాదు.. జైల్లో నెలల తరబడి ఉండి..బయటకు వచ్చినఆమె.. ఈసారి ఎన్నికల్లో చచక్రం తిప్పాలని తపిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆమె తన రాజకీయ పార్టీ పేరును తాజాగా ప్రకటించారు. ‘ఆలిండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం’గా పేర్కొన్నారు. కొబ్బరి చెట్ల సమూహాన్ని పార్టీ గుర్తుగా ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తన సన్నిహితులతో కలిసి తన రాజకీయ పార్టీ వివరాల్నివెల్లడించారు. తమ పార్టీ ఉమ్మడి కుటుంబం మాదిరి పని చేస్తుందని చెప్పిన ఆమె.. తమ పార్టీ గుర్తు ఐక్యతకు నిదర్శనంగా చెప్పటం గమనార్హం.

కొద్ది రోజుల క్రితమే ఆమె తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు. ఆమె చెప్పినట్లే.. తాజాగా రాజకీయ పార్టీని ప్రకటించం ద్వారా.. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో సమస్యలు తలెత్తాయని.. తాను సీఎంగా నియమించిన వ్యక్తి వెన్నుపోటు పొడిచినట్లుగా ఆమె చెప్పటం తెలిసిందే. తొమ్మిదేళ్లు తాను మౌనంగా ఉన్నానని.. ఇకపై అలా ఉండనని చెప్పిన ఆమె.. అందుకు తగ్గట్లే తాజాగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. తమిళనాడు ప్రజల కోసం కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మాజీ సీఎం ఎంజీఆర్ ఆలోచనలు.. సిద్ధాంతాలను కొనసాగించటమే లక్ష్యంగా తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా శశికళ చెప్పారు. తాజాగా రాజకీయ పార్టీని పెట్టిన శశికళ కారణంగా తమిళనాడురాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైనట్లుగా చెప్పాలి. ఎన్నికల వేళ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారన్నది అన్నింటికి మించిన ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.