Begin typing your search above and press return to search.

శశికళకు ఊహించని పరాభవం.. సొంతంగా పెట్టిన పార్టీ నుంచే సస్పెన్షన్!

తమిళనాడు రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళకు ఘోర పరాభవం ఎదురైంది.

By:  Tupaki Political Desk   |   30 Oct 2026 11:00 PM IST
శశికళకు ఊహించని పరాభవం.. సొంతంగా పెట్టిన పార్టీ నుంచే సస్పెన్షన్!
X

తమిళనాడు రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళకు ఘోర పరాభవం ఎదురైంది. ఆమె స్వయంగా స్థాపించిన ‘ఆల్‌ ఇండియా పురట్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ (AIPTMMK) పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగిస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.చక్రవర్తి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత శశికళ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండటం లేదని చక్రవర్తి ఆరోపించారు. ఆమెను కలిసేందుకు కూడా అవకాశం ఉండటం లేదని వెల్లడించారు. తమ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించామని చక్రవర్తి తెలిపారు.

త్వరలోనే కొత్త ప్రధాన కార్యదర్శిని నియమిస్తామని, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటామని వివరించారు. ఈ ఏడాది మార్చిలో శశికళ కొత్త పార్టీ స్థాపించారు. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకేతో పొత్తు పెట్టుకుని 70 స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఎక్కడా డిపాజిట్లు దక్కకపోవడంతో ఎన్నికల అనంతరం పార్టీ కార్యకలాపాలను తగ్గించేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు చక్రవర్తి ప్రకటించడం సంచలన చర్చకు తెరతీసింది.

ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ 2021 జనవరి 27న బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించడానికి శశికళ ఎంతో ప్రయత్నించారని చెబుతున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకోవాలని శశికళ ఆరాటపడినా ఫలితం దక్కలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల నిరీక్షణ తర్వాత శశికళ ‘ఆల్‌ ఇండియా పురట్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు.

నలుపు, తెలుపు, ఎరుపు రంగుల పట్టీలతో తన పార్టీ జెండాను రూపొందించారు. ఈ జెండా మధ్యలో ద్రావిడ ఉద్యమ అగ్రనేతలు సి.ఎన్. అన్నాదురై, ఎం.జి.రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలితల చిత్రాలను ముద్రించారు. తానే జయ వారసురాలిగా చెప్పుకున్నప్పటికీ ఎన్నికల్లో తమిళ ప్రజలు ఆమెను ఆదరించకపోవడంతో డీలా పడినట్లు చెబుతున్నారు. ఇక ఆమె పెట్టిన పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురికావడం విస్తృత చర్చకు దారితీస్తోంది.

తమిళ రాజకీయాల్లో చిన్నమ్మగా శశికళను పిలిచేవారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో జయలలితకు సమానంగా శశికళ ప్రాచుర్యం పొందారు. దశాబ్దాల పాటు 'చిన్నమ్మ'గా, అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి శాసించారు. ఒక సాధారణ వీడియో షాప్ యజమానిగా జీవితాన్ని ప్రారంభించి, తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆమె, నేడు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చుకున్నారని అంటున్నారు. తమిళనాడులోని తిరుతురైపూండిలో జన్మించిన శశికళ, భర్త నటరాజన్‌తో కలిసి చెన్నైలో మ్యారేజ్ వీడియోలు తీసే వ్యాపారం నిర్వహించేవారు.

ఆ రోజుల్లో తమిళనాడు ప్రభుత్వ పీఆర్ఓగా పనిచేస్తున్న నటరాజన్ ద్వారా అప్పటి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయలలితతో శశికళకు పరిచయం ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా గాఢమైన స్నేహంగా మారింది. 1989లో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలితకు శశికళ కుడిభుజంగా మారారు. కొద్దికాలంలోనే జయలలిత నివాసమైన 'పోయెస్ గార్డెన్'లోకి అడుగుపెట్టిన శశికళ, ఆ తర్వాత జయలలితకు అన్నీ తానై వ్యవహరించారు. 'నాకు సోదరి లాంటింది' అని స్వయంగా జయలలితే ఆమెను ప్రజలకు పరిచయం చేశారు. దీంతో పార్టీలో శశికళ పరపతి అమాంతం పెరిగిపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.

తెరవెనుక రాజకీయాల్లో సిద్ధహస్తురాలు

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ, పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి శశికళ ఎదిగారు. మన్నార్గుడి ఫ్యామిలీగా పేరుగాంచిన ఆమె బంధువులు కూడా తమిళ రాజకీయాల్లో, వ్యాపార రంగంలో చక్రం తిప్పడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.పార్టీలో ఆమె ఆధిపత్రిని నివారించడానికి జయలలిత రెండుసార్లు ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ, పరిస్థితుల ప్రభావంతో మళ్లీ వెనక్కి ఆహ్వానించాల్సి వచ్చిందని చెబుతారు.

జయలలిత జీవితపు చివరి దశలోనూ, ఆమె ఆసుపత్రిలో ఉన్న 75 రోజుల పాటు శశికళే దగ్గరుండి సేవ చేశారు. 2016 డిసెంబర్‌లో జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో శశికళ చక్రం తిప్పడానికి ప్రయత్నించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి, ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ నాయకురాలిగా కూడా ఎన్నికయ్యారు. కానీ, అదే సమయంలో ఊహించని షాక్ తగిలింది. అప్పట్లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోయింది.

జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చేసరికి తమిళనాడు రాజకీయ దృశ్యం పూర్తిగా మారిపోయింది. అన్నాడీఎంకే పగ్గాలను చేపట్టిన ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమై శశికళను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీని తిరిగి స్వాధీనం చేసుకుంటానని, అన్నాడీఎంకేను ఏకం చేస్తానని శశికళ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్నాడీఎంకే నేతలు ఆమెను చేర్చుకోవడానికి ససేమిరా అనడంతోపాటు, ఆమెపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు.

పార్టీలో తన పునఃప్రవేశానికి దారులు మూసుకుపోవడంతో ఆమె సొంతంగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఎట్టకేలకు గత మార్చిలో పార్టీని పెట్టినా, ప్రజల ఆదరణ చూరగొనలేకపోయారని అంటున్నారు. దీంతో తాను పెట్టిన పార్టీ నుంచి కూడా ఆమె సస్పెన్షన్ కు గురికావడం చర్చకు తావిస్తోంది. తాజా పరిణామాలతో శశికళ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.