‘ఆటో’కు ఆన్ లైన్ బిజినెస్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్
‘స్త్రీశక్తి’ పథకం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ఆన్ లైన్ యాప్ తీసుకురావడంతోపాటు ప్రత్యేకంగా వారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు
By: Tupaki Political Desk | 5 Oct 2025 1:43 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్ల కోసం మంచి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. ‘స్త్రీశక్తి’ పథకం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ఆన్ లైన్ యాప్ తీసుకురావడంతోపాటు ప్రత్యేకంగా వారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోడ్రైవర్ల కోసం తమ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలను వివరించారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆటోడ్రైవర్లను కోరారు.
స్త్రీశక్తి పథకంతో ఆటోడ్రైవర్లలో తమ ప్రభుత్వంపై అసంతృప్తి చెలరేగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు పథకం ప్రకటించిన అనంతరం.. ఆటోడ్రైవర్లకు బేరాలు తగ్గిపోయాయని గ్రహించి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని తీసుకువచ్చారు. గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం మాదిరిగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నా, ఆటో డ్రైవర్ల సమస్యలను ద్రుష్టిలో పెట్టుకుని ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం కన్నా అదనంగా రూ.5 వేలు పెంచి రూ.15 వేలు చొప్పున అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల మందికి శనివారం ఒకేసారి నగదు బదిలీ చేశారు.
ఇదే సమయంలో ఆటోడ్రైవర్లపై మరిన్ని వరాలు ప్రకటించారు. ఆటో డ్రైవర్లలో ఎక్కువ మంది పేదలే ఉంటారని, అందుకోసం వారి ఉపాధి భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘ఉబర్, ర్యాపిడో, ఓలా’ వంటి ఆన్ లైన్ యాప్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తరఫున ‘సర్కారీ క్యాబ్’ బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆటో బుకింగ్స్ చేసుకునే వెసులుబాటుతోపాటు డ్రైవర్లు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. దీనివల్ల ప్రయాణికులు కూడా సురక్షిత, భద్రమైన సేవలు అందే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో చాలాచోట్ల ఆటో డ్రైవర్లు సర్వీసుల కోసం తమ వంతు వచ్చేవరకు సీరియల్ ప్రకారం నిరీక్షిస్తుంటారు. ‘సర్కారీ క్యాబ్’వల్ల ఈ సమస్య అధిగమించవచ్చని చెబుతున్నారు.
ముందుగా విశాఖ, విజయవాడల్లో ‘సర్కారీ క్యాబ్’ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది కల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన 2.90 లక్షల మంది డ్రైవర్లను ఈ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా సేవలు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణల్లో అమలు అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రభుత్వ యాప్స్ వల్ల ప్రయాణికులతోపాటు ఆటో డ్రైవర్లు కూడా సంతోషంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
‘సర్కారీ క్యాబ్’ ద్వారా తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్న ప్రభుత్వం.. అదనంగా ఆటోడ్రైవర్ సంక్షేమ బోర్డు తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో పూర్తిగా ఆటో, క్యాబ్ డ్రైవర్లే ఉంటారని సీఎం వెల్లడించారు. ఇదే సమయంలో ఆటో డ్రైవర్ల నుంచి పరస్పర ప్రయోజనం ఆశిస్తున్న సీఎం బయటపెట్టేశారు. ఎక్కువ మంది ప్రజలతో కనెక్ట్ అయ్యే ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేయాలని కోరారు.
