Begin typing your search above and press return to search.

రాజుగారి దెబ్బ‌కు.. వైసీపీకి తాళం.. ఎక్క‌డంటే.. !

అలానే.. ఉమ్మ‌డి విశాఖ జిల్లా చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే స‌న్యాసి రాజు దూకుడుతో వైసీపీ నాయ‌కుల‌కు వాయిస్ లేకుండా పోయింద‌ని అంటున్నారు.

By:  Garuda Media   |   24 March 2026 1:00 AM IST
రాజుగారి దెబ్బ‌కు.. వైసీపీకి తాళం.. ఎక్క‌డంటే.. !
X

ఏపీలోని ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క త‌ర‌హా రాజకీయం న‌డుస్తోంది. అలానే.. ఉమ్మ‌డి విశాఖ జిల్లా చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే స‌న్యాసి రాజు దూకుడుతో వైసీపీ నాయ‌కుల‌కు వాయిస్ లేకుండా పోయింద‌ని అంటున్నారు. 2019లో గెలిచిన క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ.. రాజ‌కీయంగా మంచి వాయిస్ వినిపించేవారు. పార్టీ ప‌క్షానే కాకుండా.. వైఎస్ కుటుంబం ప‌క్షాన కూడా ఆయ‌న త‌ర‌చుగా తెర‌మీదికి వ‌చ్చి.. వారిని స‌మ‌ర్థించిన ప‌రిస్థితి ఉంది.

కానీ, గ‌త 15 మాసాలుగా క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న వాయిస్ కూడా వినిపించడం లేదు. అస‌లు ఆది నుంచి జ‌గ‌న్‌ను, రాజ‌శేఖ‌ర‌రెడ్డిని స‌మ‌ర్థించిన ధ‌ర్మ‌శ్రీ.. ఇప్పుడు ఇంత సైలెంట్ కావ‌డానికి కార‌ణం.. ఎమ్మెల్యేనేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న స‌న్యాసి రాజు.. గ‌తంలో రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. 2009, 2014 లో గెలుపు గుర్రం ఎక్కారు. వ‌రుస‌గా 2024లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదేస‌మ‌యంలో గ‌తంలో ధ‌ర్మ‌శ్రీ ఇచ్చిన హామీలు అమ‌లు కాని వాటిని కూడా ఇప్పుడు అమ‌లు చేస్తూ.. అక్క‌డ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గ‌త ఎమ్మెల్యే ఇచ్చిన హామీ.. కానీ, నెర‌వేర్చ‌లేక పోయారు.. ఇప్ప‌డు కూట‌మి ప్ర‌భుత్వం వాటిని నెర‌వేరుస్తోంద‌న్న సంకేతాల‌ను ఇచ్చారు. ఇది ధ‌ర్మ‌శ్రీకి మింగుడు ప‌డ‌డం లేదు. ఆయ‌న ఏం మాట్లాడాల‌న్నా.. గ‌తంలో ఏం చేశార‌న్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో అస‌లు రాజ‌కీయంగా కూడా ఆయ‌న మౌనంగా ఉండిపోతున్నారు. పోనీ.. పార్టీ ప‌రంగా అయినా.. కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారా? అంటే.. ఏదో తూతూ మంత్రం అన్న‌ట్టుగా బ‌య‌ట‌కు రావ‌డం ఆ వెంట‌నే.. మ‌ళ్లీ తెర‌చాటుకు వెళ్లిపోవ‌డం కామ‌న్‌గా మారిపోయింది. పైగా పార్టీ నుంచిత‌న‌కు స‌పోర్టు లేద‌ని ఆయ‌న బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా ధ‌ర్మ‌శ్రీ పేరు వినిపించ‌డం లేద‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తే.. స‌న్యాసి రాజు గెలుపు త‌థ్య‌మ‌ని చెబుతున్నారు.