Begin typing your search above and press return to search.

రూ.5000 కోట్లు.. 3 పార్టీలు.. ఒక్క ఫ్యామిలీ! ఎవరీ మార్టిన్?

తమిళనాడు ఎన్నికలలో ఈ సారి లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఫ్యామిలీ కేక పుట్టిస్తోంది.

By:  Tupaki Political Desk   |   7 April 2026 5:00 PM IST
రూ.5000 కోట్లు.. 3 పార్టీలు.. ఒక్క ఫ్యామిలీ! ఎవరీ మార్టిన్?
X

తమిళనాడు ఎన్నికలలో ఈ సారి లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఫ్యామిలీ కేక పుట్టిస్తోంది. ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మార్టిన్ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు ఈ సారి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ముగ్గురు మూడు వేర్వేరు పార్టీలో ఉండటమే ఆసక్తికరంగా చెబుతున్నారు. శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్ లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆమె కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ లక్షియా జననాయగ కచ్చి (ఎల్జేకే) అనే సొంత పార్టీ పెట్టుకుని పుదుచ్చేరిలో పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా మార్టిన్ అల్లుడు అదవ్ అర్జున్ తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో శాంటియాగో మార్టిన్ కుటుంబం ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో దేశంలోనే అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు ద్వారా రూ.1300 కోట్లు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన సంస్థగా మార్టిన్ గ్రూప్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మూడు పార్టీల తరఫున ఆ కుటుంబం పనిచేయడం కూడా విస్తృత చర్చకు కారణమవుతోంది. రాజకీయాలను తమ వ్యాపారానికి రక్షణ కవచంగా వాడుకోడానికే మార్టిన్ కుటుంబం ఈ సారి ఎన్నికల్లో తలపడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే మార్టిన్ గ్రూపుపై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈడీ విచారణ కూడా జరుపుతోంది. దీంతో మార్టిన్ గ్రూప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు.

ఇక తమిళనాడులో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన మార్టిన్ ఫ్యామిలీ అనేక రకాలుగా చర్చలకు కేంద్రంగా మారింది. లాల్గుడి నుంచి ఏఐడీఎంకే అభ్యర్థిగా నామినేషన్ వేసిన లీలా రోజ్ ఆస్తులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. కేవలం ఆరో తరగతి చదవిన లీలా రోజ్ తనకు రూ.5 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆమె పేరుతో రూ.139.62 కోట్ల చరాస్తులు, రూ.909.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. లీలారోజ్ భర్త శాంటియాగో మార్టిన్ పేరిట రూ.887 కోట్ల స్థిరాస్థులు, రూ.3,262 కోట్ల చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఇక ఆమె కుమారుడు జోస్ డైసన్ మార్టిన్ పేరటి రూ.439.21 కోట్ల స్థిరాస్తులు, రూ.225.56 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో 40.77 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఆస్తుల జాబితాను పరిశీలిస్తే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిచెస్ట్ అభ్యర్థిగా లీలా రోజ్ రికార్డు సృష్టించారు. తమిళనాడులో మార్టిన్ కుటుంబాన్ని లాటరీ కింగ్ గా పిలుస్తుంటారు. ఈ కుటుంబం తరఫున లీలా రోజ్ ‘మార్టిన్ ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి మూడు పార్టీల తరఫున పనిచేస్తూ ఎన్నికల్లో తలపడుతున్న మార్టిన్ కుటుంబం ద్రవిడ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.