పాకిస్తాన్ లో సంస్కృత పాఠాలు...
సంప్రతి వార్తాయ సూయంతాం...ప్రవాచకో బలదేవానంద సాగర:...30 ఏళ్ళ కిందట ఆకాశవాణి కేంద్రంలో సంస్కృత వార్తలు విన్నవారికి ఈ వాక్యం పరిచయమయ్యే ఉంటుంది
By: Tupaki Political Desk | 2 Jan 2026 5:00 PM ISTసంప్రతి వార్తాయ సూయంతాం...ప్రవాచకో బలదేవానంద సాగర:...30 ఏళ్ళ కిందట ఆకాశవాణి కేంద్రంలో సంస్కృత వార్తలు విన్నవారికి ఈ వాక్యం పరిచయమయ్యే ఉంటుంది. సంస్కృతం మనకు అర్థం కాకపోవచ్చు...కానీ తెలుగు అంటూ మనం మాట్లాడే ప్రతి మాటలో సంస్కృతమే ఉంటుంది. సరే జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును అన్న మాట తప్పని భాషావాదులు అంటున్న మాట అంగీకరించాల్సిందే. ద్రవిడ భాషాశాస్త్రం వచ్చాక...దక్షిణాది భాషలకు సంస్కృతం మూలం కాదన్న విషయం స్థాపితమైంది. ఇంత వాదోపవాదాలు జరిగినా...సంస్కృతం రాజభాష, దేవభాష అన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కర్ణాటకలోని ఓ గ్రామంలో మొత్తం సంస్కృతమే మాట్లాడుతున్నారంటే...అది మృతభాష కాదని మనమందరం గ్రహించాలి.
సంస్కృతం గురించి ఇప్పుడు ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని అంటే...ఉంది సందర్భం ఉంది. మన దాయాది దేశం పాకిస్తాన్ లో సంస్కృత భాషను ప్రవేశపెడతున్నారట. భారత్ సంస్కృతి అన్నా...వ్యవహారం అన్నా సదా నిప్పులు కక్కే పాకిస్తాన్ సంస్కృత భాషకు ఎందుకు పెద్ద పీటవేయాలనుకుంటోంది...అదే ఇపుడు ఇంటరెస్టింగ్ టాపిక్. పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయిన దరిమిలా...ఇప్పటిదాకా అన్నింటా వ్యతిరేక ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చింది. మొన్నటికి మొన్న పెహల్గాం సంఘటన వరకు పాక్ మనకు పక్కలో బల్లెంలాగానే ఉంటోంది. కానీ ఆశ్చర్యకరంగా దేశ విభజనానంతరం తొలిసారిగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్ మెంట్ సైన్సెస్ సంస్కృతం కోర్సును ప్రారంభించింది.
పాకిస్తాన్ లో సంస్కృతం కోర్సు ప్రారంభించేందుకు విశేషంగా కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ షాహిద్ రశీద్...వీరు సోషియాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉంటున్నారు. రశీద్ కు సంస్కృత భాషపై మక్కువ ఎక్కువ. లాహోర్ యూనివర్సిటీ లైబ్రరీలో సంస్కృత పుస్తకాలు దుమ్ముకొట్టి పడి ఉండటంతో...వాటిని చూసిన ప్రొఫెసర్ రశీద్ బాధపడి ఎలాగైన సంస్కృత భాషకు...వర్సీటీలో మూలన పడిఉన్న పుస్తకాలకు అర్థం పరమార్థం తీసుకురావాలని సంకల్పించారు. ఆ దిశగా అడుగులేశారు. అయితే ఈ పని అంతసులభం కాలేదు. ఏ విధమైన వివాదాలకు తావివ్వకుండా, ప్రశాంతంగా నిశ్శబ్దంగా రశీద్ తమ పని తాము చేసుకుపోయారు. ఫలితంగా సంస్కృతం కోర్సు లాహోర్ వర్సిటీలో వచ్చింది.
లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్ మెంట్ సైన్సస్ ఇపుడు నాలుగు క్రెడిట్ ల సంస్కృతం కోర్సుకు విద్యార్థుల్ని ఆహ్వానిస్తోంది. సైన్స్, టెక్నాలజీ ఏ కోర్సు చదివే విద్యార్థులైన సంస్కృతం కోర్సలో చేరే వీలు కల్పించారు. ఫస్ట్ సెమిస్టర్ లో ఇప్పటికే ఎనిమిది మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రొఫెసర్ రశీద్ తమ స్వప్రయత్నంతో...అంతర్జాతీయంగా సంస్కృత ప్రొఫెసర్ల సాయంతో ఆన్ లైన్ లో సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. తను ఇప్పటికీ సంస్కృతాన్ని నేర్చుకుంటున్నానని...ఆ భాష అనంతమని అంటారు. రశీద్ సంస్కృత పుస్తకాలు లాహోర్ వర్సిటీ ఆఫ్ మేనేజ్ మెంట్ సైన్సస్ నుంచే కాకుండా...పంజాబ్ వర్సిటీకి సంబంధమున్న పాత గ్రంథాలయాల్లోనూ ఉన్నట్లు తెలుసుకుని వాటిని సేకరించారు.
ప్రొఫెసర్ రశీద్ సంస్కృత భాషపై ప్రదర్శిస్తున్న అబిమానానికి ముగ్ధులై...ఆయన ప్రభావంతో పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సంస్కృతం షార్ట్ కోర్సు ప్రారంబించారు. 1947 వరకు ఈ యూనివర్సిటీల్లో ఎన్నో క్లాసికల్ భాషల్ని విద్యార్థులకు నేర్పించారు. అయితే ఆ తర్వాతి కాలంలో అవన్నీ కనుమరుగై పోయాయి. ప్రొఫెసర్ రశీద్ తదితరులు చేస్తున్న ఈ ప్రయత్నాలు...ప్రాచీన భాషా, సంస్కృతీ ప్రాభావాలను పునరుత్తేజం చేసినట్టయ్యింది. అయితే ఇపుడు పాకిస్తానీ విద్యార్థుల ముందున్న ప్రధాన సమస్య...సంస్కృత లిపి. ఇది దేవనాగరలిపిలో ఉంటుంది. ఇది పాకిస్తాన్ విద్యార్థులకు తెలీదు. కారణం పాకిస్తాన్ విద్యావ్యవస్థ మొత్తం ఉర్డూ,అరబిక్ లిపిలోనే సాగుతుంది. సింధ్, పంజాబీ భాషల్ని కూడా అలాగే నేర్చుకుంటున్నారు. మరి దేవనాగర లిపి నేర్చుకోవడం కష్టమే. ఇవన్నీ పక్కన పెడితే...పాకిస్తాన్ లో సంస్కృతం అభ్యసించే విద్యార్థులు, బోధించే అధ్యాపకులుండటం నిజంగా గ్రేట్.
