Begin typing your search above and press return to search.

హాకీని ఊపిరిగా పీల్చుకున్న భారతీయ గ్రామం గురించి తెలుసా..!

అవును... జలంధర్ సమీపంలోని సంసార్పూర్ గ్రామానికి భారతదేశ హాకీ గ్రామం అనే అరుదైన బిరుదు ఉంది.

By:  Raja Ch   |   10 Dec 2025 1:00 AM IST
హాకీని ఊపిరిగా పీల్చుకున్న భారతీయ గ్రామం గురించి తెలుసా..!
X

చూడటానికి అది కూడా భారతదేశంలోని ఒక గ్రామమే! అక్కడ ఇరుకైన దారులు, పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉంటాయి! కానీ.. ఇక ఒక కోణం మాత్రమే. మరోవైపు చూస్తే... ఇలాంటి గ్రామం మరే ఇతర భారతీయ గ్రామానికీ సాటిరాని చరిత్రను, వారసత్వాన్ని కలిగి ఉంది. అదే... పంజాబ్ లోని జలంధర్ సమీపంలోని సంసార్పూర్ విలేజ్. ఇది 'భారతదేశ హాకీ గ్రామం / ఇండియాస్ హాకీ విలేజ్' అనే విరుదును సంపాదించుకుంది.

అవును... జలంధర్ సమీపంలోని సంసార్పూర్ గ్రామానికి భారతదేశ హాకీ గ్రామం అనే అరుదైన బిరుదు ఉంది. అందుకు కారణం... ఇక్కడ నుంచి 14 మంది ఒలింపియన్లతో సహా 300 మందికి పైగా హాకీ ఆటగాళ్లు పుట్టుకొచ్చారు.. ప్రపంచ వేదికలపై సగర్వంగా నిలబడ్డారు. ఎందుకంటే... ఈ గ్రామ ప్రజలకు హాకీ అనేది ఒక క్రీడ మాత్రమే కాదు.. అది వారి జీవన విధానం.. క్రమశిక్షణతో కూడిన సంస్కృతి.

ఎందుకంటే... ఈ గ్రామంలోని ప్రతీ ఇంట్లో ఒక హాకీ ఆటగాడు ఉండేవాడు. ఫలితంగా.. ప్రతీ వీధి ప్రాక్టీస్ వేదికగా మారిపోయేది. అదే ఏ స్థాయిలో అంటే.. ఈ గ్రామంలోని పిల్లలు సరిగ్గా చదవడం, సరళంగా రాయడం నేర్చుకోకముందే హాకీ బ్యాట్ పట్టుకునేటంత. అలా అని వీరికి ఏమీ విలాసవంతమైన గ్రౌండ్ లు, ఖరీదైన అకాడమీలు లేవు.. గ్రామంలోని కఠినమైన మైదానాలే వీరికి శిక్షణా స్థలాలు.

అలాంటి చోట కష్టపడిన ఈ గ్రామంలోని హాకీ ఆటగాళ్లు.. ప్రపంచ వేదికలపై నిలబడ్డారు. ఇందులో భాగంగా... ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు ఆటగాళ్లు ఒకే ఒలింపిక్ క్రీడలో పోటీ పడ్డారంటే... సంసార్పూర్ గ్రామం హాకీ ఆటలో ఏ స్థాయి విజయం సాధించిందో పరిపూర్ణంగా అర్ధం చేసుకోవచ్చు. ఇందులో ఐదుగురు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగా.. ఇద్దరు కెన్యాకు ఆడారు.

అదేంటీ.. ఇద్దరు భారతీయులు కెన్యా తరుపున ఆడటం ఏమిటనే సందేహం రావొచ్చు. అందుకు కారణం... బ్రిటిష్ పాలనలో అనేక మంది సంసార్పూర్ పురుషులు కెన్యా సైన్యంలో చేరారు. ఈ సమయంలో వారి హాకీ నైపుణ్యం కెన్యా దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.

అయితే అది చరిత్ర!.. 1990 - 2000 నాటికి సంసార్పూర్ హాకీ ఆధిపత్యం క్షీణించింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో భాగంగా... యువత విదేశాలకు వలసలు వెళ్లిపోవడంతో పాటు కెరీర్ ప్రాధాన్యతలు మారడం కారణంగా ఆ స్థాయిలో కొత్త ఆటగాళ్లను సంసార్పూర్ అందించలేకపోయింది! అయినప్పటికీ హాకీని ఊపిరిగా పీల్చుకున్న గ్రామంగా సంసార్పూర్ ఎప్పుడూ గొప్పదే! ఈ క్రమంలో చరిత్ర పునరావృతం అవ్వాలని కోరుకుందా..!