సంక్రాంతి ట్రాఫిక్ కు గొప్ప పరిష్కారం చూపిన రేవంత్ చొరవ!
ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం ఖాళీ అవుతుంది. లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు పయనమవుతుండటంతో జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతాయి.
By: A.N.Kumar | 10 Jan 2026 8:45 AM ISTప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం ఖాళీ అవుతుంది. లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఊర్లకు పయనమవుతుండటంతో జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా హైదరాబాద్ - విజయవాడ హైవేపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం.. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం ప్రయాణికులకు నరకప్రాయంగా మారుతోంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ)కు చేసిన ప్రతిపాదనలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో ఈ దిశగా వేగంగా అడుగులు పడ్డాయి.
శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్.. ఎలా పనిచేస్తుంది?
ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు విజయవాడ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రభుత్వం సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. వాహనాలు టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పని లేకుండానే హై-రిజల్యూషన్ కెమెరాలు.. సెన్సర్లు వాహన నంబర్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా టోల్ ఛార్జీలను కట్ చేస్తాయి. పంతంగి వద్ద ఉన్న 16 బూత్‌లలో విజయవాడ వైపు వెళ్లే 8 బూత్‌లలో ప్రస్తుతం ఈ శాటిలైట్ ఆధారిత వ్యవస్థను పరీక్షించారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఒక్కో బూత్ ద్వారా నిమిషానికి 20 వాహనాలను పంపే వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సాంకేతిక సవాళ్లు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ట్రయల్ రన్ సమయంలో కొన్ని సాంకేతిక లోపాలు టెన్త్ మొత్తం కట్ కాకపోవడం వంటివి వెలుగు చూసినప్పటికీ వాటిని సరిచేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. రద్దీ ఎక్కువగా ఉండే పండుగ రోజుల్లో ఇబ్బందులు కలగకుండా అదనంగా రెండు బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా ఫాస్టాగ్ స్కానింగ్ చేసి వాహనాలను త్వరగా పంపేలా సిబ్బందిని మోహరించారు. ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించే సమయాన్ని తగ్గించి సురక్షితమైన వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యం.
ఈ నూతన విధానం విజయవంతమైతే కేవలం సంక్రాంతికే కాకుండా భవిష్యత్తులో అన్ని ప్రధాన జాతీయ రహదారులపై ఈ 'స్టాప్-లెస్' టోల్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
