'దారి'మళ్లించారు.. విజయవాడ-హైదరాబాద్ మధ్య కీలక మార్పు!
సంక్రాంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఏపీకి వచ్చిన వారు.. తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు శనివారం(రేపు) నుంచి రెడీ అవుతున్నారు.
By: Garuda Media | 17 Jan 2026 1:09 AM ISTసంక్రాంతిని పురస్కరించుకుని హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి ఏపీకి వచ్చిన వారు.. తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు శనివారం(రేపు) నుంచి రెడీ అవుతున్నారు. ఆదివారం వరకు సెలవులు ఉన్నా.. ఒక రోజు ముందుగానే.. ప్రయాణాలు పెట్టుకునే అవకాశం ఉంది. దీంతో విజయ వాడ-హైదరాబాద్ మధ్య ఉన్న జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా.. తెలంగాణ పరి ధిలోని పలు జిల్లాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.
తద్వారా.. పండుగ ప్రయాణాలు.. విసుగు తెప్పించకుండా ఉండాలన్నదే కీలక నిర్ణయమని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా.. తిరుగు ప్రయాణంలోనే ఎక్కువగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహ దారిపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీనిని ముందుగానే నియంత్రించేందుకు ఈ ఏడాది.. ప్రయోగాత్మకంగా పలు జిల్లాలలో వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లిస్తున్నారు. తద్వారా హైవేపై ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ.. దారి మళ్లింపు మార్గాలు!
+ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వారు.. గుంటూరు.. మిరియాల గూడ.. కొండమల్లేపల్లి మీదుగా హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఇది తక్కువ ట్రాఫిక్ ఉండే రహదారి.
+ పల్నాడు జిల్లా మాచర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారికి.. నాగార్జున సాగర్.. పెద్దాపూర్, చింతపల్లి మీదుగా రూట్‌ను కేటాయించారు. వాస్తవానికి ఇప్పటి వరకు విజయవాడ మీదుగా వీరు వెళ్తున్నారు. ఇక నుంచి తాజా రూట్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరమ్మతులు చేశారు.
+ నల్లగొండ నుంచి వెళ్లే వారు సహజంగానే హైవే ఎక్కేస్తారు. కానీ, మర్రిగూడ బై పాస్ నుంచి మునుగోడు ఎక్కి.. అక్కడి నుంచి చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా ఈ సారి అధికారులు ప్లాన్ చేశారు.
+ మరీ ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు చేరుకునే వారికి.. చిట్యాల వద్ద ట్రాఫిక్ మళ్లించారు. వీరు.. ఇక్కడ నుంచి భువనగిరి వరకు వేరే మార్గంలో వెళ్లి.. అక్కడ హైదరాబాద్ హైవే ఎక్కనున్నారు.
+ అదేసమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై భారీ జరిమానాలు విధించేందుకు తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు. ఈ క్రమంలో డ్రోన్లను రంగంలోకి దింపారు. హైవేపై నిర్దేశిత వేగాన్ని మించినా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా.. డ్రోన్లు పసిగడతాయి. ఇలాంటివారికి పోలీసులు భారీ జరిమానాలు విధించనున్నారు.
