Begin typing your search above and press return to search.

సంక్రాంతి సంబరాలలో కిలకిల రావాలు

భోగీ పండుగ చెత్తా చెదారం ఏరివేసి మంటలలో వేసేది. అంటే పల్లెలలో ఉన్న వ్యర్ధాలు అన్నీ ఇలా కాల్చి వేస్తారు అన్న మాట.

By:  Satya P   |   15 Jan 2026 10:08 PM IST
సంక్రాంతి సంబరాలలో కిలకిల రావాలు
X

సంక్రాంతి పండుగ అంటే ఇది ప్రకృతి పండుగ. ఆ మాటకు వస్తే హిందూ ఆచారాలలో పండుగలు అన్నీ కూడా ప్రకృతిని అల్లుకుని ఆరాధిస్తూ సాగే పండుగలుగానే చెప్పాలి ఇక సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకించి వ్యవసాయదారుల పండుగ. పంటల పండుగ. రబీ సీజన్ గా పిలిచే శీతాకాలంలో వేసే పంట సరిగ్గా చేతికి అంది ఇంటికి వచ్చే సమయంలో సంక్రాంతిని నిర్వహిస్తారు. ఈ పండుగ మూడు రోజుల విశిష్టత చూస్తే అదే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

సార్ధకత కోసమే :

భోగీ పండుగ చెత్తా చెదారం ఏరివేసి మంటలలో వేసేది. అంటే పల్లెలలో ఉన్న వ్యర్ధాలు అన్నీ ఇలా కాల్చి వేస్తారు అన్న మాట. ఇక సమృద్ధిగా పంట లక్ష్మి ఇంట చేరితే ఆ భాగ్యాన్ని కొలుస్తూ చేసే పండుగ సంక్రాంతి. బండ్లకు రంగులు వేసి ఎడ్లకు అలంకరణ చేసి పొలాల నుంచి పంటను ఇంటికి తెచ్చే అతి పెద్ద వేడుకగా చేసుకుంటారు. అందుకే ఈ పంటకు ఉత్పత్తి పండుగ అని మరో పేరు ఉంది. ఈ సృష్టిలో ధనం అంటే కరెన్సీ కాదు, ఉత్పత్తి. ఈ భూమి మీద ఉత్పత్తి జరిగేది కూడా పంట మాత్రమే. ఆ పంటతోనే సంపద సృష్టి జరుగుతుంది. అందుకే సంక్రాంతి లక్ష్మి అని పౌష్య లక్ష్ని అని కూడా ఈ పండుగ వేళ అమ్మ వారిని కొలుస్తూ ఉంటారు.

పిచ్చుకలు ఏవీ :

ఇక పిచ్చుకలు పంట నష్టపోకుండా రైతులను కాపాడే మిత్రులుగా చెబుతారు. చీడ పీడల నుంచి పురుగుల నుంచి అవి పంటలను కాపాడి రైతులకు ఆనందం కలిగిస్తాయి. అందుకే పంట చేతికి అందగానే రైతులు చేసే మొదటి పని పిచ్చుకల రుణం తీర్చుకోవడం. వాటికి తమ ధాన్యం పంట నుంచి కొంత వేరుగా చేసి తమ ఇంటి ముంగిళ్ళలో లోగిళ్ళలో పెడతారు. వాటిని తినేందుకు బిలబిలమంటూ పిచ్చుకలు ఒక్కోటిగా వచ్చి చేరుతాయి. అవి చేసే శబ్దాలు ప్రకృతి నాదంగా ఉంటాయి. అలా పక్షులు పెద్ద సంఖ్యలో గతంలో వచ్చి వాలేవి. కానీ ఇపుడు ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. పూరిళ్ళు మిద్దెల ఇళ్ళు ఉన్నపుడు పక్షులు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. ఇపుడు మాత్రం వాటి జాడ కానరావడం లేదు, అవి అంతరించిపోతున్నాయి.

పట్టణీకరణతో :

పల్లెలు కూడా మునుపటి మాదిరిగా లేవు, అక్కడా మేడలు బహుళ అంతషులు వెలుస్తున్నాయి. దాంతో పిచ్చుకలు పూరిళ్ళ మాదిరిగా గూడు కట్టుకునే సదుపాయం లేదు, పెంకుటిళ్ళు కూడా లేకపోవడంతో వాటి ఆవాసం కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇంకో వైపు చూస్తే గ్రామాలలో సైతం సెల్ టవర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వాటి అయస్కాంత తరంగాలతో పిచ్చుకలు రేడియేషన్ కి గురి అయి నశించిపోతున్నాయని చెబుతున్నారు. దాంతో ఇపుడు ఎక్కడ చూసినా పిచ్చుకలు కిల కిల రావాలు అయితే వినిపించడం లేదు, రైతన్నలు సంప్రదాయం ప్రకారం పక్షుల కోసం వదిలిన ధాన్యం గింజలు అలాగే అక్కడే పడి ఉంటున్నాయి. మరి అడవులు అంతరించడం ప్రకృతి శోభ తగ్గిపోవడంతో జీవ వైవిధ్యంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల సంతతి అంతరించేందుకు కారణం అవుతున్నాయని అంటున్నారు.