పందెం కోళ్లు ఎన్ని రకాలో.. 'కుక్కుట శాస్త్రం' ఏమిటో తెలుసా..!
తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి సందడి మొదలైపోయింది. దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నవారు సొంత ఊర్లకు చేరుకున్నారు.
By: Raja Ch | 13 Jan 2026 5:03 PM ISTతెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి సందడి మొదలైపోయింది. దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నవారు సొంత ఊర్లకు చేరుకున్నారు. ఈ సమయంలో కోడి పందేళ సందడి మొదలైపోయింది. ఎక్కడికక్కడ బరులు దర్శనమిస్తున్నాయి. వాటిని రంగు రంగు కాగితాలతో, మెరుపులతో అలంకరించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గోదారి జిల్లాల్లో ఈ సందడి మామూలు లేదనే చెప్పాలి! ఈ సందర్భంగా ఈ పందెం కోళ్లు ఎన్ని రకాలు.. వాటికి ఎన్ని నక్షత్రాలు ఉంటాయి.. వాటిని ఎలా పెంచుతారు.. ఏ రోజున ఏ దిక్కుకు తిరిగి కోడిని వదిలితే మంచి జరుగుతుంది మొదలైన విషయాలో ఉన్న కోడి పంచాంగం కుక్కట శాస్త్రం గురించి మొదలైన విషయాలు తెలుసుకుందాం..!
అవును... సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. కోడి పందెంలకు బరులు సిద్ధమైపోయాయి. ఈ సందర్భంగా పందెం కోళ్లు ఎన్ని రకాలు ఉంటాయనేది తెలుసుకుందామ్..! వాటి వాటి రంగుని బట్టి వాటిని ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఇక వీటికి సంబంధించిన "కుక్కుట శాస్త్రం" లో 27 నక్షత్రాలు ఉండగా.. అందులో ఏ నక్షత్రంలోని కోడి మరే నక్షత్రంలో కోడిపై గెలుస్తుంది.. ఓడిపోతుంది.. ఏ రోజున కోడిని ఏ దిశలో ఉండి పందెం బరిలోకి వదలాలి మొదలైన లెక్కలన్నీ ఆ శాస్త్రంలో పొందు పరచబడ్డాయి. పందెం కోళ్లు దాదాపు 10 నుంచి 15 రకాలు ఉంటాయి! ఇందులో దాని రంగుని బట్టి రకరకాల జాతులుగా విభజించారు. ఆ జాతులు.. వాటి ప్రత్యేకత ఇప్పుడు చూద్దామ్..!
కాకి - ఈ కోడిపుంజుకి నల్లని ఈకలుంటాయి.

సేతువ - ఈ కోడిపుంజుకి మొత్తం ఈకలు తెల్లగా ఉంటాయి.

కాకి డేగ పర్ల - ఈ పుంజుకు మెడ, వీపుపై గోదుమ రంగు, మిగిలిన భాగం నల్ల రంగు ఈకలు ఉంటాయి.

తెల్ల సవల - మెడ, వీపుపై తెల్లని ఈకలుంటాయి.. మిగిలిన భాగం నల్ల ఈకలు ఉంటాయి.

నల్ల సవల - మెడ, వీపుపై గోదుమ రంగు ఈకలుంటాయి.. మిగిలిన భాగం నల్ల ఈకలు ఉంటాయి.

కొక్కిరాయి - ఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి

రసంగి డేగ - ఈకలు మొత్తం ఎర్రగా ఉంటాయి

కోడి డేగ - దీని ఒళ్లంతా ఎర్ర ఈకలు ఉండి, తోక ఈకలు మాత్రం నల్లగా ఉంటాయి.

కాకి నెమలి - ఈ పుంజుకు రెక్కలపైన లేదా వీపుపైన తెలుపు, పసుపు రంగు ఈకలుంటాయి

కౌజు - మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగులో ఈకలుంటాయి

మైల - ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి

పర్ల - ఒక్కో ఈక నలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి

పట్టెడ - వీపుపై ఎర్రగా ఉండి మిగిలిన శరీరమంతా నల్ల ఈకలు ఉంటాయి.

పింగళ - కోడి మొత్తం నల్ల్గా ఉండి మెడ, వీపు పైన ఎర్రగా ఉండి తోక ఈకలు అక్కడక్కడా తెల్లగా ఉంటాయి.

ఇదే సమయంలో... 'కోడి రంగు - దాని లక్షణాలూ గురించి తెలుసుకుందామ్..!:
ఎర్ర కోడి - ధైర్యం, వేగం, పోరాట స్వభావం
నల్ల కోడి - గంభీరత్వం, ఆలోచనాత్మకత
తెలుగు కోడి - ఓర్పు
మిశ్రమ రంగు కోడి - అస్థిరత, మార్పులు
పొడవైన మెడ కోడి (ఏ రంగుదైనా) - అప్రమత్తత, తెలివి
గట్టి కాళ్ల కోడి (ఏ రంగుదైనా) - బలం, స్థైర్యం
ఇప్పుడు.. కోళ్ల పందెంలో కోడిని ఏ రోజు ఏ దిశలో వదిలితే మంచి ఫలితాలు వస్తాయో చూద్దామ్..!
ఆదివారం, శుక్రవారం — ఉత్తర దిశలో
సోమవారం, శనివారం — దక్షిణ దిశలో
మంగళవారం — తూర్పు దిశలో
బుధవారం, గురువారం — పడమర దిశలో
కోడి పందాల రకాలు!:
ఇక కోడి పందాలు రెండు రకాలుగా ఉంటాయి! అవి.. కత్తి పందెం, డింకీ పందెం! ఈ సమయంలో.. కత్తి పందెంకు దించాలా లేక డింకీ పందెంకు దించాలా అనేది పూర్తిగా కోడి యజమాని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. పోటీల్లో పాల్గొనే కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలో దించితే దాన్ని కత్తిపందెం అంటారు. ఈ పందెంలో కత్తి దెబ్బ తట్టుకుని చివరి వరకూ ఏ పుంజు నిలుస్తుందో అదే విజేత అవుతుంది. ఈ పోటీ చాలా తక్కువ సమయమే జరుగుతుందని చెప్పొచ్చు.
ఇదే క్రమంలో.. కత్తులు లేకుండా కోడి పుంజులను బరిలోకి దించితే దాన్ని డింకీ పందెం అని అంటారు. ఈ పోటీ పూర్తిగా కోడి శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. రెండూ మంచి శక్తిసామర్థ్యాలు కలిగి ఉంటే. ఒక్కోసారి ఫలితం చాలా ఆలస్యం అవుతుంటుంది. సాధారణంగా కత్తి పందెంలో పాల్గొనఏ కోళ్ల కంటే.. డింకీ పందెంలో పాల్గొనే కోళ్లు చాలా ధృడంగా ఉంటాయి!
అత్యంత శ్రద్ధంగా పెంపకం!:
పందెం కోళ్ల పెంపమకం అంటే సామాన్యమైన విషయం కాదు. సమయానికి నాలుగు గింజలు పడేస్తే సరిపోదు. వీటికి చిన్న సైజు మిలటరీ శిక్షణ ఇస్తారని చెప్పినా అతిశయోక్తి కాదేమో. వీటికి బలవర్ధకమైన ఆహారం తినిపించడంతోపాటు రన్నింగు, స్విమ్మింగు కూడా చేయిస్తరు. శిక్షణ అనంతరం ఒంటినొప్పులు పోయేందుకు మసాజ్ చేస్తారు. ఈ క్రమంలో తొలుత ఉదయాన్నే కోడిపుంజును పరుగెత్తించి.. అది అలిసిపోయాక నోట్లో నీరు కొట్టి కఫాన్ని బయటకు తెప్పిస్తారు.
అనంతరం.. పచ్చి కోడి గుడ్డు తెల్ల సొన తినిపిస్తారు. కాసేపు విశ్రాంతి అనంతరం జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, నల్ల జీలకర్ర - గసగసాలు - తెల్ల జీలకర్ర కలిపి దంచిన మిశ్రమాన్ని ముద్దగా చేసి తినిపిస్తారు. భోజనం అనంతరం రెండు గంటలు రెస్ట్ ఇచ్చి.. ఆ తర్వాత ఈత కొట్టిస్తారు. మసాజ్ అనంతరం రాత్రికి మళ్లీ మంచి భోజనం పెట్టి విశ్రాంతి ఇస్తారు. తక్కువలో తక్కువ వీటి ఆహారానికి ఒక్కో కోడికి వారానికి 2 నుంచి 5 వేల రూపాయల వరకూ ఖర్చవుతుంది!
కుక్కుట శాస్త్రంలో కోడి పుంజులకు సంబంధించి మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఇక ప్రధానంగా ఏ జాములో ఏ జాతి కోడికి విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయో కూడా ఈ శాస్త్రం చెబుతోంది.
ఇందులో భాగంగా... భోగి రోజు ఉదయం 6:00 గంటల నుంచి 8:24 వరకూ కాకి, సేతు, నెమలి, నల్ల కొక్కిరాయి.. ఉదయం 8:24 నుంచి 10:48 వరకూ నెమలి, తెల్ల కొక్కిరాయి.. 10:48 నుంచి మధ్యానం 1:12 వరకూ డేగ, ఎర్ర కొక్కిరాయి, సేతు, మైల, గెరువ.. 1:12 నుంచి 3:36 వరకూ కాకి, నెమలి, నల్ల కొక్కిరాయి, నల్ల బొట్ల సేతు, మైల, డేగ.. 3:36 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నెమలి, ఎర్ర మైల.. 6:00 నుంచి మరుసటి రోజు తెల్లవారే వరకూ కాకి, నల్లబొట్ల సేతు, నెమలికి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు! ఈ రోజు తూర్పు వైపు నుంచి పడమర వైపుకు విడిచి పెడితే విజయావకాశాలు ఎక్కువని చెబుతున్నారు!
ఇక సంక్రాంతి రోజు ఉదయం 6:00 గంటల నుంచి 8:24 వరకూ డేగ, పింగళ, కొక్కిరాయి, గెరువ.. ఉదయం 8:24 నుంచి 10:48 వరకూ కాకి, నెమలి, నల్ల కొక్కిరాయి, సేతువ.. 10:48 నుంచి మధ్యానం 1:12 వరకూ నెమలి, మైల, .. 1:12 నుంచి 3:36 వరకూ పింగళ, కాకి, నల్లబొట్ల సేతు, నల్లకొక్కిరాయి.. 3:36 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నెమలి, తెల్లకొక్కిరాయి.. 6:00 నుంచి మరుసటి రోజు తెల్లవారే వరకూ డేగ, కొక్కిరాయి, ఎర్ర మైల, గెరువకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు! ఈ రోజు పడమర వైపు నుంచి పడమర తూర్పుకు విడిచి పెడితే విజయావకాశాలు ఎక్కువని చెబుతున్నారు!
కనుమ రోజు ఉదయం 6:00 గంటల నుంచి 8:24 వరకూ డేగ, మైల.. ఉదయం 8:24 నుంచి 10:48 వరకూ కాకి, నల్లబొట్ల సేతువ, నెమలి, నల్ల కొక్కిరాయి.. 10:48 నుంచి మధ్యానం 1:12 వరకూ నెమలి, తెల్ల కొక్కిరాయి, కాకి .. 1:12 నుంచి 3:36 వరకూ డేగ, ఎర్ర కొక్కిరాయి, మైల, గెరువ.. 3:36 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నెమలి, కాకి, నల్ల కొక్కిరాయి, నల్లబొట్ల సేతువ, మైల.. 6:00 నుంచి మరుసటి రోజు తెల్లవారే వరకూ డేగ, మైల, గెరువకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు! ఈ రోజు దక్షిణం వైపు నుంచి పడమర ఉత్తరం వైపుకు విడిచి పెడితే విజయావకాశాలు ఎక్కువని చెబుతున్నారు!
నోట్: కోడి పందాలు చట్టరీత్యా నేరం!
