Begin typing your search above and press return to search.

ఏపీ తెలంగాణల్లో సంక్రాంతి సెలవులు ఖరారు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండుగ సెలవుల తేదీలు ఖరారయ్యాయి.

By:  A.N.Kumar   |   22 Nov 2025 8:00 PM IST
ఏపీ తెలంగాణల్లో సంక్రాంతి సెలవులు ఖరారు
X

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండుగ సెలవుల తేదీలు ఖరారయ్యాయి. సంప్రదాయాలు, సంబరాలతో నిండిన ఈ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామాలలో జరుపుకునేందుకు వీలుగా విద్యా శాఖలు ప్రత్యేక సెలవులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేయగా తెలంగాణలో కూడా అదే ధోరణి కనిపించనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 9 రోజుల సంక్రాంతి సెలవులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 10 నుండి జనవరి 18, 2026 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను అధికారికంగా ప్రకటించింది. జనవరి 19, 2026 (సోమవారం) నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. పదో తరగతి ,ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈసారి మొత్తం 9 రోజుల పాటు సెలవులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో కూడా అదే ధోరణి.. త్వరలో ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో కూడా సంక్రాంతి సెలవులు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మొదట్లో జనవరి 10 నుండి 15 వరకు సెలవులు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏపీ తరహాలోనే పూర్తిస్థాయి సెలవులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సెలవుల ఖరారు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జనవరిలో వరుస పండుగలు.. అదనపు సెలవులు

సంక్రాంతి పండుగతో పాటు జనవరి నెలలో మరిన్ని జాతీయ , ప్రాంతీయ పండుగలు రావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు లభిస్తున్నాయి. ఇది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.

పండుగ కోసం ముందే ప్రయాణ ప్రణాళికలు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. రైలు టికెట్లు దాదాపుగా బుక్ అయిపోయాయి. బస్సుల్లో కూడా టికెట్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. పండుగకు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ప్రయాణ ఇబ్బందులు తగ్గించుకోవచ్చు.