Begin typing your search above and press return to search.

గంటకు 5,800 పై చిలుకు వాహనాలు.. భాగ్యనగరం ఖాళీ అవుతోందా..!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. భాగ్యనగరం బోసిపోతుందనే సంగతి తెలిసిందే. రోడ్లన్నీ గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతాయి. వాహనాలన్నీ ఆంధ్రా వైపు పరుగులు తీస్తుంటాయి.

By:  Raja Ch   |   11 Jan 2026 5:07 PM IST
గంటకు 5,800 పై చిలుకు వాహనాలు.. భాగ్యనగరం ఖాళీ అవుతోందా..!
X

సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. భాగ్యనగరం బోసిపోతుందనే సంగతి తెలిసిందే. రోడ్లన్నీ గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతాయి. వాహనాలన్నీ ఆంధ్రా వైపు పరుగులు తీస్తుంటాయి. ఎంత తొందగరా ఊరు చేరిపోదామా.. మరెంత తొందరగా సంబరాల్లో మునిగిపోదామా అనే ఆతృతలోనే అందరి మనసులూ ఉంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్ టు విజయవాడం హైవే వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త స్థాయిలో రికార్డ్ నమోదైందని చెబుతున్నారు.

అవును... సంక్రాంతి పండగ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరవాసులు అంతా సొంతూళ్ల బాట పడతారన్న సంగతి తెలిసిందే. దీంతో.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కనిపిస్తున్న కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులను చూస్తుంటే.. భాగ్యనగరం ఖాళీ అవుతోందా అన్నట్టుగా ఉందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం నుంచి గంట గంటకూ వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై కదులుతున్నాయి.

ఈ క్రమంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా కనిపించింది. ఇందులో భాగంగా.. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు సుమారు 21,000 వాహనాలు ప్రయాణించగా... శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ సంఖ్య 22,000 కు చేరుకుందని పంతంగి టోల్‌ ప్లాజా సిబ్బంది చెప్పిన పరిస్థితి. ఈ నెంబర్ శనివారం సాయంత్రం టు ఆదివారం ఉదయానికి పీక్స్ కి చేరిందని అంటున్నారు.

ఇందులో భాగంగా.. పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు.. అంటే 12 గంటల వ్యవధిలో దాదాపు 70,000 వాహనాలు ఆంధ్ర ఏపీ వైపు వెళ్లినట్లు టోల్ సిబ్బంది వెల్లడించారు! అంటే.. గంటకు దాదాపు 5,800 పై చిలుకు వాహనాలు అన్నమాట! ఈ రేంజ్ తాకిడిని తట్టుకునేందుకు అదనపు టోల్ బూత్ లను అందుబాటులోకి తెచ్చి, ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే.. రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ స్టేట్ ఆర్టీసీ దాదాపు 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. ఏపీ స్టేట్ ఆర్టీసీ కూడా 600 కు పైగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు టూవీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా.. అతివేగంగా ప్రయాణించవద్దని.. కాస్త సమయమనంతో వాహనాలు నడపాలని.. పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు!